
అన్నాచెల్లెళ్ల అనురాగానికి విలువ కట్టేదెవరు. తోడబుట్టిన వారి ఆప్యాయతానురాగాలకు హద్దే ఉండదని మరోసారి రుజువైంది. చేయి పట్టి నడిపించిన నీవు లేని లోకం నాకు చీకటి అనుకుందో లేదా.. అమ్మ, నాన్న అన్నీ అయి పెంచిన అన్న లేని లోకంలో నేను ఎందుకనుకుందో ఏమో గానీ.. సోదరుడు తనువు చాలించిన కొద్దిసేపటికే పరలోకాలకు వెళ్లిపోయిందా సోదరీమణి. చివరకు మరణంలోనూ అన్నాచెల్లెళ్ల బంధాలకు అడ్డుగోడలు లేవు అన్న తీరుగా.. ఆ ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం అందరినీ ఆవేదనకు గురిచేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరులో జరిగింది. గంట వ్యవధిలోనే తోడబుట్టినవారు ఇలా ప్రాణాలు విడవడంతో ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
కల్లూరుకు చెందిన 65 సంవత్సరాల పోశన్న అనే వ్యక్తి మృతిచెందారు. తన అన్న లేడన్న విషయం తెలుసుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఆయన చెల్లెలు పోశవ్వ(55) సైతం ప్రాణాలు విడిచింది. చివరకు వారి పేర్లు కూడా ఒకటే కావడం ఆశ్చర్యకరంగా నిలిచింది.