ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ED అరెస్టు చేసింది. ఇప్పటివరకు విచారణల నుంచి తప్పించుకుంటున్న ఆయన్ను ఎట్టకేలకు ED చేజిక్కించుకుంది. సెర్చ్ వారెంట్ పేరిట ఆప్ అధినేతను విచారించేందుకు గాను ED(Enforcement Directorate) అధికారులు ఆయన నివాసానికి వెళ్లారు. 12 మందితో కూడిన అధికారుల బృందం కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంది. ఇప్పటికే తొమ్మిదిసార్లు ED నోటీసులు అందుకున్న కేజ్రీవాల్.. ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. మూడు గంటల హైడ్రామా అనంతరం ఢిల్లీ CMను అధికారులు అరెస్టు చేసినట్లు ప్రకటించారు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో…
మనీ లాండరింగ్ కేసులో ED తనను అరెస్టు చేయకుండా ఆదేశాలిచ్చి తనకు రక్షణ కల్పించాలంటూ గురువారం ఉదయం ఢిల్లీ హైకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు. అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమంటూ జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చిచెప్పడంతో ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు మార్గం సుగమమైంది. అయితే ఆప్ చీఫ్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపేందుకు ఏప్రిల్ 22న గడువిచ్చింది. సీఎంను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ సివిల్ లైన్స్ ప్రాంతంలోని ఆయన అధికారిక నివాసం వద్ద భారీ స్థాయిలో పోలీసుల్ని మోహరించారు.
ఈ నెల 16న…
కేజ్రీవాల్ కు ఈ నెల 16న రౌస్ అవెన్యూ కోర్టు నుంచి బెయిల్ లభించింది. రౌస్ అవెన్యూ కోర్టులోని CBI కోర్టే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను విచారిస్తున్నది. ఇప్పటికే ఈ కేసులో BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈనెల 16న కోర్టు ఎదుట ప్రవేశపెట్టిన రోజే కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. మనీలాండరింగ్ వ్యవహారంపై ఇప్పటికే 9 సార్లు తప్పించుకున్న కేజ్రీవాల్.. ఈసారి మాత్రం దాన్నుంచి బయటపడలేకపోయారు. ED అధికారులు సెర్చ్ వారెంట్ తో ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో ఆమ్ ఆద్మీ నాయకులు, కార్యకర్తలు భారీయెత్తున చేరుకోవడంతో అంతకుముందే పెద్దసంఖ్యలో బలగాల్ని మోహరించారు.
సుప్రీంలోనూ…
బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు ఆదేశాల్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ లాయర్లు సుప్రీంలో పిటిషన్ వేశారు. అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని కోరారు. వీలైత గురువారం రాత్రే పిటిషన్ పై విచారణ జరపాలని అభ్యర్థించారు. అటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీశ్ సిసోడియాతోపాటు ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రే కటకటాల పాలవుతుండటంతో హస్తిన రాజకీయాలు గందరగోళంలో పడ్డాయి. అయితే జైలు నుంచే ఢిల్లీ సీఎంగా ఆయన పరిపాలన సాగిస్తారని ఆప్ నేతలు అంటున్నారు. కేజ్రీవాల్ నివాసంలో సోదాలు జరుపుతున్న అధికారులు.. కాసేపట్లో ఆయన్ను ED కార్యాలయానికి తరలించనున్నారు.