ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేసిన ప్రకారమే టీచర్ పోస్టుల రిక్రూట్ మెంట్ చేపట్టాలంటూ పలువురు అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. మొత్తం 13 వేలకు పైగా ఖాళీలున్నాయని ప్రకటిస్తే… కేవలం 5,089 పోస్టులు భర్తీ చేయడమేంటంటూ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించే యత్నం చేశారు. బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు.. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. టీచర్ రిక్రూట్మెంట్ల కోసం రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ప్రకటించారు. పాఠశాల విద్య శాఖలో 5089 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లల్లో 1,523 పోస్టులు భర్తీ కానున్నాయి. జిల్లాల్లోని కలెక్టర్లే ఈ నోటిఫికేషన్ ను రెండు రోజుల్లో రిలీజ్ చేస్తారని మంత్రి తెలిపారు. జిల్లా లెవెల్లో జరిగే రిక్రూట్ మెంట్ ప్రక్రియకు ఛైర్మన్ గా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ వైస్ ఛైర్మన్ గా, DEO సెక్రటరీగా, ZP CEO మెంబర్ గా ఉంటారు.
టీచర్ పోస్టుల ప్రకటనపై అభ్యర్థులు మండిపడుతున్నారు. ఒక్కో ఉద్యోగానికి వేలల్లో కాంపిటీషన్ ఉందని, పూర్తిస్థాయిలో రిక్రూట్ మెంట్ చేపడితే ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇప్పటికే వేలాది సంఖ్యలో ఎదురుచూస్తుంటే ఇప్పటి తాజా టెట్ వల్ల మరింత మంది అభ్యర్థులు టీచర్ పోస్టుల ఎగ్జామ్స్ రాస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంపిటీషన్ విపరీతంగా పెరుగుతుందని, కాబట్టి అన్ని పోస్టులు భర్తీ చేస్తే ఎక్కువ మందికి జాబ్ లు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.