ఉత్తర్ ప్రదేశ్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఇద్దరు పిల్లల్ని అమానవీయంగా పొట్టనపెట్టుకున్న కిరాతకుడు పోలీసుల ఎన్ కౌంటర్(Encounter)లో హతమయ్యాడు. బదౌని జిల్లా కేంద్రంలో ఈ దారుణ ఘటన జరిగింది. బదౌని పట్టణంలోని అలాపూర్ కాలనీలో నివాసముంటున్న క్షౌరశాల యజమాని(Salon Owner) మహ్మద్ సాజిద్ అనే 22 ఏళ్ల వ్యక్తి.. పక్క వీధి బాబా కాలనీలో కాంట్రాక్టర్ వినోద్ ఠాకూర్ ఇంట్లో చొరబడ్డాడు.
దారుణంగా…
వినోద్ ఠాకూర్ కు ముగ్గురు కుమారులు ఉండగా అందరిపైనా దాడికి తెగబడ్డాడు. ఇద్దరు పిల్లలు 13 ఏళ్ల ఆయుష్, ఆరు సంవత్సరాల అహాన్ అలియాస్ హఖ్నీని పదునైన ఆయుధం(Sharp Weopon)తో హత్య చేశాడు. మూడో కుమారుడు ఎనిమిదేళ్ల పీయూష్ పైనా దాడికి పాల్పడినా… ఆ బాలుడు గాయాలపాలయ్యాడు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై మండిపడ్డ అక్కడి స్థానికులు సెలూన్ కు నిప్పుపెట్టారు. నిందితుణ్ని పట్టుకోవాలంటూ పెద్దయెత్తున ఆందోళనలు చేశారు.
మతకల్లోలానికి దారితీసేలా…
బాధితులు, నిందితుడు వేర్వేరు కమ్యూనిటీలకు చెందివారు కావడంతో భారీగా అల్లర్లు చెలరేగే స్థాయికి చేరుకుంది పరిస్థితి. దీంతో నిందితుడు సాజిద్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. పట్టుకునేందుకు ప్రయత్నిస్తే తమపైనే కాల్పులు జరిపాడని, ప్రతిగా జరిపిన కాల్పుల్ల్లో నిందితుడు గాయపడి హాస్పిటల్ కు తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడని బదౌని SSP అలోక్ ప్రియదర్శి తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.