హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ముగ్గురు కీలక నిందితులు కాసేపట్లో పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. కలహర్ రెడ్డి, హిటాచి సాయి, స్నార్ట్ పబ్ సూర్య ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. పోలీసుల ఎదుట లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నైజీరియన్లతోపాటు పలువురిని రిమాండ్ కు తరలించారు. మరోవైపు సినీ యాక్టర్ నవదీప్ ను నార్కోటిక్ పోలీసులు విచారణ నిర్వహించారు. తరచూ రేవ్ పార్టీలు నిర్వహించడం, డ్రగ్స్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం వంటి వాటిని నార్కోటిక్ పోలీసులు గుర్తించారు.
ఆగస్టు 31న హైదరాబాద్ మాదాపూర్ లోని అపార్ట్ మెంట్ పై దాడి చేసి డ్రగ్స్ నిందితులను పట్టుకున్నారు. సినీ ఫైనాన్షియర్ వెంకటరత్నారెడ్డి సహా బాలాజీ, మురళిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడం ద్వారా మరికొంతమంది అడ్రస్ దొరికింది. ఆ వివరాల ఆధారంగానే నైజీరియన్లతోపాటు మిగతా వారిని పట్టుకోగలిగారు. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా.. పోలీసుల ముందు లొంగిపోవాలని కోర్టు స్పష్టం చేసింది.