Published 29 Jan 2024
ఆమె ఓ యువ కథానాయకుడి(Cine Hero)తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సదరు యువతికి సినిమా వాళ్లతో బాగానే సంబంధాలున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. అలాంటి యువతి అనూహ్యంగా పోలీసులకు పట్టుబడింది. అలా ఇలా కాదు.. ఏకంగా మత్తుపదార్థాలు(Drugs) సరఫరా చేస్తూ. ఇప్పటికే హైదరాబాద్ జంట నగరాల్ని జల్లెడ పడుతున్న అధికారులకు.. ఈ యువతి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం సంచలనంగా మారింది. నార్సింగిలో దాడికి దిగిన SOT(Special Operations Team) పోలీసులకు ఆమె నుంచి డ్రగ్స్ దొరికాయి. లావణ్య అనే యువతిని అదుపులోకి తీసుకుని NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
గోవా నుంచి నెట్ వర్క్…
4 గ్రాముల విలువైన MDMA అనే పేరు గల డ్రగ్స్ ను యువతి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈమె ఈ మత్తుపదార్థాన్ని గోవా నుంచి తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కొద్ది నెలల క్రితం మోకిలా డ్రగ్స్ కేసులోనూ ఈమె నిందితురాలిగా ఉన్నారు. మూడు నెలల క్రితం మోకిలా పోలీస్ స్టేషన్ లో కేసు కూడా ఫైల్ అయింది. కోకాపేటలోని విల్లాలో ఉంటున్న లావణ్య.. RTC బస్సు ఎక్కుతున్న సమయంలో ఆమెను పట్టుకుని హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఉనీత్ రెడ్డి అనే వ్యక్తి తనకు డ్రగ్స్ ఇచ్చినట్లు ఆమె పోలీసులకు చెప్పింది. డ్రగ్ వినియోగదారు(Consumer)గా లావణ్యపై నిఘా పెట్టిన SOT టీమ్.. పక్కా సమాచారంతో దాడులకు దిగింది. ఈమె ఓ యువ నటుడికి ప్రేయసిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమె సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఆమె ప్రియుడైన హీరోకు వీటితో ఏవైనా సంబంధాలున్నాయా, లేదంటే ఈ మాఫియాకు ప్రధాన సూత్రధారులెవరనేదానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.