Published 24 Nov 2023
అనుమానం వచ్చిన ఏ ఒక్కరినీ ఎన్నికల సంఘం విడిచిపెట్టడం లేదు. ఈ ఎలక్షన్లలో ఎలాగైనా ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలన్న టార్గెట్ తో భారీ యెత్తున సోదాలకు దిగడం సంచలనంగా మారుతున్నది. ఇప్పటికే రాజకీయ నాయకులపై దృష్టి సారించిన అధికారుల బృందాలు.. ఇప్పుడు ఉన్నతాధికారులనూ టార్గెట్ చేసుకున్నాయి. ఎన్నికల్లో ప్రభావం చూపే విధంగా డబ్బులు దాచారన్న సమాచారంతో రిటైర్డ్ IAS అధికారి AK గోయల్ ఇంట్లో భారీగా సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంపై ఎన్నికల సంఘం(Election Commission) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అధికారుల సోదాల విషయం తెలుసుకున్న ఈ రిటైర్డ్ IAS.. వెంటనే తన నివాసానికి చేరుకున్నారు.
కొన్నాళ్లు ప్రభుత్వ సలహాదారుగా
AK గోయల్ 2010లో రిటైర్డ్ కాగా.. కొద్దికాలం పాటు BRS ప్రభుత్వ సలహాదారు(Adviser)గా పనిచేశారు. ఈయన ఇంట్లో భారీస్థాయిలో డబ్బు దాచారనే అనుమానంతో ఎలక్షన్ స్క్వాడ్ తోపాటు టాస్క్ ఫోర్స్ అధికారులు పెద్దయెత్తున సోదాలు చేస్తున్నారు. మరోవైపు గోయల్ ఇంటి వద్దకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు.