ఇప్పటికే కల్వకుంట్ల కవిత ఇంట్లో దాడులు నిర్వహించి ఆమెను అరెస్టు చేసిన ED.. ఆమె బంధువులనూ వదిలిపెట్టడం లేదు. BRS MLC సమీప బంధువులకు చెందిన ఇళ్లల్లో వరుసగా సోదాలకు దిగుతున్నది. కవితను ఇప్పటికే కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుని ఆరు రోజుల పాటు విచారణ పూర్తి చేసిన ED అధికారులు… ఇప్పుడు ఆమె సంబంధీకులపైనా దృష్టిసారించారు. ఈ కస్టడీని మరో మూడు రోజుల పాటు పొడిగించాలని మళ్లీ కోర్టును అధికారులు ఆశ్రయించే అవకాశాలు కనపడుతున్నాయి.
కేజ్రీవాల్ అరెస్టుతో…
కేజ్రీవాల్ ను ఈనెల 21న రాత్రి అరెస్టు చేసిన ED.. 22 నాడు కోర్టులో హాజరుపరిచింది. ఆయన్ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరితే ఆరు రోజుల పాటు అంటే ఈనెల 28 వరకు ED కస్టడీకి అప్పగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో కేజ్రీవాల్ ను ఈరోజు నుంచి విచారించనున్నారు దర్యాప్తు సంస్థ ఉన్నతాధికారులు. అయితే కేజ్రీవాల్ తోపాటు కవితను కూడా కలిపే విచారించాలన్న ఆలోచనతో ఆమె కస్టడీని మరో మూడు రోజుల పాటు పొడిగించాలని(Extend) కోర్టును కోరబోతున్నారు.