
Published 27 Jan 2024
అర్థరాత్రి అమ్మాయిల వసతిగృహం(Hostel)లోకి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. అందరి కళ్లుగప్పి లోపలికి ప్రవేశించిన దొంగలకు ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే అప్పటికే ఆ ఇద్దరు అక్కడున్నవారి దృష్టిలో పడ్డారు. ఇంకేముంది.. వాళ్లకు దొరక్కుండా ఒకడు తప్పించుకుపోతే మరొకడు మాత్రం దొరికిపోయాడు. ఇక ఆ దుండగుణ్ని బాదుడే బాదుడు. ఇదీ అర్థరాత్రి పూట సికింద్రాబాద్ లోని లేడిస్ హాస్టల్ లో జరిగిన తతంగం.
సికింద్రాబాద్ ఉస్మానియా(Osmania) పీజీ లేడీస్ హాస్టల్ లో ఈ ఘటన జరిగింది. స్నానాల గది(Bathroom) కిటీకీలు పగులగొట్టి అగంతుకులు లోపలికి చొరబడ్డారు. విద్యార్థినుల(Student)పై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారు. ఇలాంటి సమయంలో అమ్మాయిలంతా అరుపులు, కేకలతో అందరినీ అలర్ట్ చేయడమే కాకుండా వాళ్లను దొరకబచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో ఒకడు తప్పించుకుని పారిపోగా.. మరొకణ్ని చున్నీతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. దీనిపై హాస్టల్ తోపాటు సమీప ప్రాంతాల్లో గందరగోళం ఏర్పడింది.
పట్టుకున్నవాణ్ని అమ్మాయిలతోపాటు అక్కడున్నవారు కుళ్లబొడిచారు. అగంతుకుల చొరబాటుపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా… విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్ లో తమకు రక్షణ కరవైందని, CCTVలు ఏర్పాటు చేయాలంటూ రోడ్డుపైనే ధర్నాకు దిగారు. వీరికి వివిధ విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. సమస్య పరిష్కరిస్తామని ప్రిన్సిపల్(Principal) హామీ ఇవ్వడంతో అందరూ ఆందోళనను విరమించుకున్నారు.