మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్ పుత్(29) హత్య కేసులో ఒక్కో నిజం బయటపడుతోంది. ప్రియుడు(Lover) సాహిల్ శుక్లా(25)తో కలిసి భర్తను చంపిన ముస్కాన్ రస్తోగి(27).. మృతదేహాన్ని డ్రమ్ లో ఉంచి సిమెంట్ తో మూసేసింది. ‘పప్పా డ్రమ్ మే హై’ అని ఆరేళ్ల కూతురు చెప్పడంతో పాప కళ్లెదుటే హత్య జరిగినట్లు భావిస్తున్నారు. భర్తను చంపేందుకు సాహిల్ ను రెచ్చగొట్టింది ముస్కాన్. కొన్నేళ్ల క్రితమే సాహిల్ తల్లి చనిపోయింది. ‘మీ తల్లి ఆత్మ శాంతి కలగాలంటే నా భర్తను చంపెయ్.. ఇది ఆమె నుంచి వచ్చిన సంకేతం’ అంటూ నకిలీ మెసేజ్ లతో ప్రియుణ్ని నమ్మించింది.
సతీమణికి బర్త్ డే సర్ ప్రైజ్ ఇద్దామని ఫిబ్రవరి 24న లండన్ నుంచి మీరఠ్ చేరుకున్న నేవీ అధికారి.. ఈనెల 4 హత్యకు గురయ్యాడు. అతణ్ని చంపేందుకు నవంబరు నుంచే ప్లాన్ చేసిందామె. చికెన్ కోసమంటూ సౌరభ్ తిరిగిరాకముందే రెండు కత్తుల్ని కొని తెచ్చుకుంది. భర్తకు మత్తుమందు ఇచ్చి తాను డ్రగ్స్ తీసుకుంది ముస్కాన్. అతడు నిద్రమత్తులోకి జారుకున్నాక డ్రగ్స్ మత్తులో ఉన్న ఆమె.. ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది.