బోధన్ మాజీ శాసనసభ్యుడు(MLA), BRS నేత షకీల్ తనయుడు సాహిల్ అలియాస్ రహీల్ కు కోర్టు రిమాండ్ విధించింది. దుబాయ్ నుంచి వచ్చి శంషాబాద్ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టగానే అతణ్ని అరెస్టు చేశారు. ప్రజా భవన్(Praja Bhavan) గోడల్ని కారుతో బద్ధలు కొట్టిన కేసులో మాజీ MLA షకీల్ తనయుడు సాహిల్ పై పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో అతణ్ని మూడున్నర నెలల తర్వాత పోలీసులు పట్టుకోగలిగారు.
14 రోజుల రిమాండ్…
సాహిల్ ను నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఈనెల 22 వరకు అతడు జైలులో ఉంటాడు. ఈ మేరకు నిందితుణ్ని చంచల్ గూడ కారాగారానికి తరలించారు. సాహిల్ అలియాస్ రహీల్.. ర్యాష్ డ్రైవింగ్ తో ప్రజాభవన్ గేట్లను బద్ధలు కొట్టిన ఘటనలో బారికేడ్లు ధ్వంసమయ్యాయి. కారులో సాహిల్ తోపాటు అమ్మాయిలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. గత డిసెంబరు 23న అర్థరాత్రి ఘటన జరిగిన సమయంలోనే అందర్నీ అదుపులోకి తీసుకున్నారు.
అదే రాత్రి నిందితుణ్ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించిన కొద్దిసేపటికే షకీల్ అనుచరులు అక్కడకు చేరుకుని సాహిల్ పేరును FIRలో చేర్చొద్దంటూ అతణ్ని తీసుకెళ్లిపోయారు. నిందితుడి స్థానంలో షకీల్ ఇంట్లో పనిచేసే వ్యక్తి అసిఫ్ పేరును FIRలో చేర్చారు. దుబాయ్ పారిపోయాడని గుర్తించిన పోలీసులు లుక్ అవుట్ నోటీసులపై రహీల్ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆ నోటీసుల్ని కొట్టివేయడంతోపాటు ఈనెల 19లోపు లొంగిపోవాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది.