Published 18 Dec 2023
స్నేహం కోసం ప్రాణం ఇచ్చే మిత్రులుంటారు.. స్నేహం కోసం సర్వం త్యాగం చేసే వారుంటారు.. కానీ స్నేహం పేరిట కుటుంబాన్నే హత్య చేసిన ఘటన సభ్య సమాజాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. ఆస్తి కోసం 9 రోజుల వ్యవధిలో ఆరుగురు హత్యకు గురికావడం నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపింది. కేవలం ఒక ఇల్లు కోసం స్నేహితుడి ఇంట్లోని అందర్నీ మట్టుబెట్టి మానవమృగంగా నిలిచాడో రాక్షసుడు. మాక్లూర్ కు చెందిన ప్రసాద్, ప్రశాంత్ స్నేహితులు. ప్రసాద్ కు అప్పులు ఎక్కువ కావడంతో లోన్ ఇప్పిస్తానంటూ ప్రశాంత్ నమ్మించాడు. లోన్ ప్రాసెస్ ఈజీ అంటూ ఆ బాధ్యత తనదేనని నమ్మించి ప్రసాద్ ఇంటిని రాయించుకున్నాడు. బ్యాంకుల చుట్టూ తిరిగినా లోన్ రాకపోవడంతో.. తిరిగి తన పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాలని ప్రశాంత్ ను ప్రసాద్ ఒత్తిడి చేశాడు. కానీ ఎలాగైనా ఆ ఇంటిని దక్కించుకోవాలన్న కుట్రతో ప్రసాద్ కుటుంబంపై కన్నేశాడు ప్రశాంత్.
వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నా…
ప్రసాద్ తన కుటుంబంతో కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో, ప్రశాంత్ నిజామాబాద్ లో ఉంటున్నారు. ప్లాన్ ప్రకారం ప్రసాద్ ను తన వెంట తీసుకెళ్లి డిచ్ పల్లి హైవే పక్కన హత్య చేసి పూడ్చి పెట్టాడు. అప్పులిచ్చినవారి కంప్లయింట్ తో ప్రసాద్ ను పోలీసులు తీసుకెళ్లారని నమ్మించి ఆయన భార్య రమణిని వెంట తీసుకెళ్లి బాసర సమీపంలోని గోదావరి నదిలో పడేశారు. కొడుకు, కోడల్ని పోలీసులు అరెస్టు చేశారంటూ ప్రసాద్ తల్లిని నమ్మించిన ప్రశాంత్.. ఇద్దరు చిన్నారుల్ని తీసుకుని సోన్ బ్రిడ్జి వద్ద కిరాతకంగా హత్య చేసి కాల్వలో పడేశాడు. అంతకుముందే మృతుడి ఇద్దరు చెల్లెళ్లనీ అదే విధంగా నమ్మంచి ఒక్కొక్కరినీ హత్య చేశాడు. మూడు హత్యలు తాను స్వయంగా చేశానని, మరో మూడు హత్యలు మిగతా వారితో కలిసి చేశానని చెప్పడంతో దారుణం వెలుగుచూసింది.
కుటుంబాన్ని కోల్పోయిన మాతృమూర్తి
కొడుకు, కోడలు, ఇద్దరు కూతుళ్లు, కవల మనవడు, మనవరాలు.. పాపం ఆ వృద్ధురాలు. జరిగింది గుర్తుకు వస్తేనే ప్రతి ఒక్కరి గుండెలు బరువెక్కిపోయే హృదాయ విదారక ఘటన ఇది. కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తే ఆస్తి తనదవుతుందని కుట్ర పన్నిన ఉన్మాది ఘాతుకంతో ఆ వృద్ధురాలికి కడుపుకోత, గుండెకోత తప్ప మరేం మిగల్లేదు.