Published 27 Nov 2023
ప్రచారానికి తెరపడుతున్న సమయంలో రెండు ప్రధాన పార్టీల మధ్య వైరం మరింత పెరిగిపోయింది. ఉన్నతస్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలకు దిగితే.. కింది స్థాయిలో దాడులు, ప్రతిదాడులకు పాల్పడుతున్నారు. BRS నాయకులు డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో వికారాబాద్ జిల్లా కేంద్రంలో గొడవ చోటుచేసుకుంది. డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ అధికార పార్టీకి చెందిన కార్యాలయం ముందు ప్రధాన ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలు నినాదాలు చేస్తూ లోపలకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. తమపైనే దాడికి వస్తారా అంటూ BRS వర్గాలు ఒక్కసారిగా వారిపైకి దూసుకెళ్లాయి. దీంతో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన పోలీసులు లాఠీలకు పనిచెప్పి ఇరువర్గాలను చెదరగొట్టారు.
పై స్థాయిలో అలా.. కిందిస్థాయిలో ఇలా..
మీడియాలో ప్రకటనలు, ప్రభుత్వ పథకాలపై ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గిరాజుకుంటున్నది. ఒక పార్టీపై మరో పార్టీ ఫిర్యాదులు చేసుకోవడంతో రెండు వర్గాలకు ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. తమ పర్మిషన్ లేకుండా తెలంగాణలో ప్రకటనలు(Advertisements) ఎలా ఇస్తారంటూ కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం(CEC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపటిలోగా వివరణ ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర CSకు లేఖ పంపింది. పైన అలా, కింద ఇలా అన్న తీరుగా అధికార, విపక్షాల మధ్య ఎన్నికల వేడి అగ్గిని రాజేస్తున్నది.