ఎన్నికల సంఘం(EC) ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్(Flying Squad Teams) లు మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ రావు ఇంట్లో సోదాలు జరుపుతున్నాయి. ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీసిటీలో ఉన్న ఆయన నివాసానికి ఉదయాన్నే అధికారుల బృందాలు చేరుకున్నాయి. ఎన్నికల రూల్స్ సక్రమంగా పాటిస్తున్నారా లేదా అన్న కోణంలో తుమ్మల నివాసాన్ని పరిశీలించేందుకు రెండు టీమ్ లుగా అధికారులు వెళ్లారు. ఫ్లైయింగ్ స్క్వాడ్స్ తోపాటు స్థానిక పోలీసులు జాయింట్ గా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. తుమ్మల నాగేశ్వర్ రావు ప్రస్తుత ఎన్నికల్లో ఖమ్మం స్థానం నుంచి హస్తం పార్టీ తరఫున బరిలో నిలిచారు.
అనుమానించిన గంటలోనే రంగంలోకి
జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నేతలతోపాటు తనపైనా IT, ED దాడులు జరిగే అవకాశముందని, అంతకు గంట ముందే మాజీ MP పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుమానించారు. ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్న కొద్దిసేపటికే తుమ్మల ఇంట్లో సోదాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-ఛైర్మన్, పాలేరు అభ్యర్థి అయిన పొంగులేటి అనుమానించిన రీతిలోనే సోదాలు జరగడం ఆశ్చర్యకరంగా మారింది.