Pic By The Times Of India
Published 05 Jan 2024
తప్పు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తూ అరాచక శక్తులను ఏరిపారేస్తున్న ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh) లో మరో గ్యాంగ్ స్టర్ హతమయ్యాడు. ముందుగా బుల్డోజర్లకు పనిచెప్పడం.. దారికి రాకుంటే అంతు చూడటమన్న చందంగా సాగుతున్న యూపీ సర్కారులో.. మరో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రాణాలు కోల్పోయాడు. వినోద్ ఉపాధ్యాయ్ అనే గ్యాంగ్ స్టర్ ను గత రాత్రి సుల్తాన్ పూర్ లో మట్టుబెట్టినట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. దౌర్జన్యాలకు పాల్పడుతూ ఇప్పటికే ఎన్నో కేసులు నమోదైన వినోద్ ఉపాధ్యాయ్ కోసం.. STF(స్పెషల్ టాస్క్ ఫోర్స్) ఆపరేషన్ చేపట్టింది. ఇతడిపై లక్ష రూపాయల రివార్డు ఉండగా.. ఎదురుకాల్పుల్లో హతమైనట్లు అధికారులు ప్రకటించారు. గతంలో మాదిరిగానే తొలుత బుల్డోజర్లు, ఆ తర్వాత వేట తరహాలోనే ఇతడూ హతమయ్యాడు.
హత్యల్లో కేటుగాడు…
గోరఖ్ పూర్ జిల్లాలోని గులేరియాకు చెందిన ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అనే జిల్లా అధికారి(Additional District Government Counsel)ని హత్య చేసిన కేసులో ఈ గ్యాంగ్ స్టర్ ప్రధాన నిందితుడు. జిల్లా అధికారిని రూ.5 లక్షలు డిమాండ్ చేసి మరీ ప్రాణాలు తీసిన వినోద్ ఉపాధ్యాయ్ కోసం పోలీసులు రివార్డ్ ప్రకటించారు. గతంలో రూ.50 వేలు ఉన్న రివార్డును కాస్తా 2023 సెప్టెంబరు 9న లక్ష రూపాయలకు పెంచి నిఘాను తీవ్రం చేశారు. సుల్తాన్ పూర్లోనే మరో వ్యక్తిని చంపడానికి స్కెచ్ వేసిన సమయంలో పోలీసులు కూంబింగ్ కొనసాగించారు. గోరఖ్ పూర్, బస్తి, సంత్ కబీర్ నగర్ తోపాటు పలు జిల్లాల్లో వ్యాపారులను డబ్బుల కోసం బెదిరించడం, ఇవ్వకుంటే చంపేయడమే ఇతడి పని. సదర్ అసెంబ్లీ స్థానంలో 2007 ఎన్నికల్లో BSP నుంచి పోటీ చేసి ఓడిపోయాడు.
‘యోగి మార్క్’ స్టైల్ లోనే…
గులేరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ గ్యాంగ్ స్టర్ కు చెందిన 7 వేల చదరపు అడుగుల్లో గల ఇల్లు, కమర్షియల్ కాంప్లెక్స్ ను రూల్స్ కు విరుద్ధంగా కట్టారంటూ.. 2023 జూన్ లో బుల్డోజర్లతో కూల్చివేశారు. ఆ స్థలం విలువే రూ.500 కోట్లు ఉంటుందని గోరఖ్ పూర్ డెవలప్మెంట్ అథారిటీ తెలిపింది. దోపిడీలు, దొంగతనాలు, పాశవిక హత్యల వంటి అత్యంత క్రిమినల్ కేసులు ఈ నేరగాడిపై 35 వరకు ఉన్నాయి.
లొంగిపోయి జైళ్లలో ఆశ్రయం…
యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత యూపీలో పెద్దసంఖ్యలో ఎన్ కౌంట్లర్లు జరిగాయి. ఇప్పటివరకు కుప్పలుతెప్పలుగా గ్యాంగ్ స్టర్లు, రౌడీ షీటర్లు, మాఫియా ముఠాల లీడర్లు హతమయ్యారు. అంతే సంఖ్యలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్వచ్ఛందంగా లొంగిపోతూ జైళ్లలో చేరిపోతున్నారు. యోగి జమానాలో యూపీలో భారీగా నేరాలు తగ్గడం వెనుక ఈ ఎన్ కౌంటర్లే ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.