విదేశాల నుంచి అక్రమంగా బంగారం ట్రాన్స్ పోర్ట్ చేస్తూ దుండగులు వరుసగా పట్టుబడుతున్నారు. ఈరోజు శంషాబాద్ ఎయిర్ పోర్ట్(Airport) లో పెద్దయెత్తున బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు ప్రయాణికుల నుంచి 8 కిలోల్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.4.86 కోట్లు ఉంటుందని అక్కడి అధికారులు తెలియజేశారు. బ్యాంకాక్, దుబాయ్, షార్జా నుంచి వచ్చిన ప్యాసింజర్స్ నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తొలుత బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల ద్వారా రూ.2.30 విలువ గల 3.78 కిలోల్ని పట్టుకున్నారు. లోదుస్తుల్లో బిస్కెట్ బిళ్లల్ని ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నారని గుర్తించారు. షార్జా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మరొకరి నుంచి రూ.1.31 కోట్ల విలువైన 2.17 కిలోల బంగారాన్ని గుర్తించారు.
అటు దుబాయ్ నుంచి హైదరాబాద్ లో అడుగుపెట్టిన ప్యాసింజన్ నుంచి రూ.1.24 కోట్ల విలువైన 2.05 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రకటించింది. ఇంత పెద్దమొత్తంలో పట్టుబడటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. గత కొద్ది రోజులుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెద్దయెత్తున బంగారాన్ని పట్టుకుంటున్నా నిందితులు ఏ మాత్రం భయపడటం లేదు. ఈ అక్రమ రవాణాపై కస్టమ్స్ అధికారులు నిఘా పెడుతున్న విషయం మాత్రం అరెస్టయిన నిందితుల గుండెల్లో గుబులు రేపుతోంది.