
ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఎన్నాళ్లకో ఒకసారి వస్తూ ఉంటాయి.. ఆ వచ్చిన పరీక్షల్ని రాసే అవకాశమే ఉండదు అంటూ గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. గ్రూప్-2ను వాయిదా వేయాలంటూ పెద్దయెత్తున ధర్నా నిర్వహించారు. ముందుగా సమావేశమైన క్యాండిడేట్స్.. ఉస్మానియా యూనివర్సిటీలో పొద్దున్నుంచి ఆందోళన కొనసాగించారు. ఒకే నెలలో అన్ని పరీక్షలు నిర్వహిస్తే ఎలా రాసేది అంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ నెలలో గురుకుల పరీక్షలు ఉన్నందున ఇటు అటు చదవడం ఎలా అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 1 నుంచి 23 వరకు గురుకుల ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. వీటి కోసం ప్రిపేర్ అవుతుండగా.. గ్రూప్-2 ఎగ్జామ్స్ వాయిదా పడే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో ఒకరిద్దరు MLAలు ప్రస్తావించగా.. మంత్రి ప్రకటన చేస్తారా అన్న ఆశతో కనిపించారు. నిజంగానే వాయిదా పడతాయని ఆశించిన అభ్యర్థులకు అవన్నీ ఊహాగానాలేనని అర్థమైంది. దీంతో ప్రగతి భవన్ ను ముట్టడించాలని నిర్ణయించి ఆర్ట్స్ కాలేజీ నుంచి బయల్దేరుతుండగానే పోలీసులు అరెస్టు చేశారు. ఆర్ట్స్ కాలేజీ వద్దనే వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ట్ స్టేషన్ కు తరలించారు.