
Published 15 Dec 2023
ఇద్దరు పిల్లల్ని తుపాకీతో కాల్చి భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ గన్ మన్ కేసులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఘటనపై దృష్టిసారించిన పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద గన్ మన్ గా పనిచేస్తున్న ఆకుల నరేశ్ కు ఆన్ లైన్(Online) అప్పులు ఎక్కువైనట్లు పోలీసులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఆన్ లైన్ గేమింగ్ లో పెట్టుబడులు పెట్టడం వల్లే భార్యభర్తల మధ్య గొడవ తలెత్తిందని, దీంతో ముగ్గురి ప్రాణాలు తీసి తాను కూడా కాల్చుకుని చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆన్ లైన్ బెట్టింగ్ ల వల్లేనని…
దుర్ఘటన జరిగిన చిన్నకోడూరు మండలం రామునిపట్లకు చేరుకున్న క్లూస్ టీమ్ లు వివరాలపై ఆరా తీస్తున్నాయి. పిల్లలిద్దర్నీ స్కూల్ నుంచి తీసుకువచ్చి మరీ ప్రాణాలు తీశాడంటే ఆ దంపతులు మానసికంగా ఎంత కుంగిపోయారోనన్నది స్పష్టమవుతున్నదని అక్కడి పోలీసు అధికారులు అంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆన్ లైన్ బెట్టింగ్ లేనన్న నిర్ణయానికి పోలీసులు వస్తున్నారు. తన సతీమణి చైతన్యతోపాటు పిల్లలను కాల్చిన నరేశ్.. దారుణ ఘటనకు పాల్పడటంపై దర్యాప్తు కొనసాగుతోంది.