వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై CBI కోర్టులో విచారణ కొనసాగింది. CBI దాఖలు చేసిన అనుబంధ అభియోగ పత్రాలు ఇప్పించాలంటూ కోర్టులో ఇరుపక్షాల వాదనలు నడిచాయి. ఛార్జ్ షీట్ కాపీలు, వాంగ్మూలం సహా కోర్టుకు CBI సమర్పించిన కాపీలు ఇప్పించాలని నిందితుల తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు. అయితే డిజిటల్ కాపీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని దర్యాప్తు సంస్థ CBI తరఫు లాయర్లు వివరించారు. డిజిటల్ కాపీలు కాకుండా జిరాక్స్ పేపర్లు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని నిందితుల తరఫు లాయర్లు కోర్టును అభ్యర్థించారు. 20 వేల పేజీలు ఉన్నందున హార్డ్ కాపీలు ఇవ్వడం కష్టమవుతున్నందున కుదరదని, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సాఫ్ట్ కాపీ రూపంలో ఇస్తామని CBI తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు.
మొత్తం ఎనిమిది మంది నిందితులకు సంబంధించిన పేపర్లు ఇవ్వాలని కోరగా… వచ్చే విచారణ సందర్భంగా ఆ కాపీలు ఇస్తామని కోర్టుకు CBI తెలిపింది. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 22కు వాయిదా వేసింది. MP అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డితోపాటు గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉదయశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి కోర్టుకు అటెండ్ అయ్యారు.