ప్రత్యర్థి పార్టీల నేతలు, తమకు గిట్టనివారి ఫోన్లను BRS ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఫోన్ల ట్యాపింగ్ కు పాల్పడటంతోపాటు హార్డ్ డిస్క్(Hard Disk)లు సహా పలు కీలక ఆధారాల్ని ధ్వంసం చేసిన కేసులో ఇప్పటికే DSP ప్రణీత్ రావును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB)లో కీలకంగా పనిచేసిన ఆయనపై పంజాగుట్ట PSలో కేసు ఫైల్ అయింది. దీంతో అతణ్ని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కొన్ని రోజులుగా విచారణ చేస్తున్నారు.
కోర్టులో మొండిచెయ్యి…
తన అరెస్టు అక్రమమంటూ SIB డీఎస్పీ ప్రణీత్ రావు హైకోర్టు(High Court)లో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా తనను కస్టడీకి ఇచ్చారని, ఇన్వెస్టిగేషన్ లోని విషయాలు లీక్ చేస్తున్నారని, తన కస్టడీ పిటిషన్ కొట్టివేయాలని పిటిషన్ లో కోరారు. అయితే కోర్టు ఆదేశాల(Directions) మేరకే ప్రణీత్ ను ప్రశ్నిస్తున్నామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలియజేశారు. దీంతో కేసు వివరాల్ని పరిశీలించిన న్యాయస్థానం.. ప్రణీత్ పిటిషన్ కొట్టి(Reject)వేసింది.
ఇంతకుముందే వేటు…
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే DSP ప్రణీత్ రావు సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. ఆయన్ను అరెస్టు చేసింది. సిరిసిల్ల జిల్లా క్రైం రికార్డ్స్ బ్యూరో(DCRB) DSPగా ఉన్న ఆయన.. గతంలో కంప్యూటర్లలోని 42 హార్డ్ డిస్క్ లను మార్చడంతోపాటు CC కెమెరాలు ఆఫ్ చేసి మరీ వాటిని ధ్వంసం చేసినట్లు గుర్తించారు. వాటిని వికారాబాద్ అడవుల్లో పడేసినట్లు ప్రణీత్ రావు మొన్నటి విచారణలో ఒప్పుకోగా.. వాటిని తీసుకువచ్చేందుకు ప్రత్యేక టీమ్ ను పంపించారు.