ఎఫ్ఐఆర్(First Information Report) విషయంలో పోలీసులకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. ప్రజల కోసం పోలీసులున్నారని, పోలీస్ స్టేషన్ కు ఎవరూ సరదాగా రారు అంటూ కోర్టు సీరియస్ అయింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిని భయాందోళనకు గురిచేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదంటూ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో FIR ఫైల్ చేయించడం ఎంతో కష్టంగా మారిందని, ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. తమ కిందిస్థాయి సిబ్బంది ప్రవర్తనాశైలి(Attitude) మార్చేలా చూడాలంటూ DGPని ఆదేశించింది.
కరీంనగర్ మహిళ కేసులో…
కరీంనగర్ కు చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై అక్కడి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో FIR నమోదు చేయని కారణంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం(High Court) ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదంటూ సదరు మహిళ.. కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. FIR విషయంలో కీలక సూచనలు చేసింది. ఫిర్యాదుదారు ఇచ్చింది ఒకవేళ తప్పుడు కంప్లయింట్ అని గుర్తిస్తే దానిపై కూడా FIR నమోదు చేయొచ్చని క్లారిటీ ఇచ్చింది.
ఇకపై కోర్టుకు రాకుండా…
ఇకపై FIRల విషయంలో మరెవరూ ఇలా కోర్టులకు రాకుండా చూసుకోవాలంటూ పోలీసు బాస్ ను హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో సదరు పోలీసు ఠాణా SHO(Station House Officer)… న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. తీవ్ర ఆరోపణలున్న పరిస్థితుల్లో ఎలాంటి కంప్లయింట్ అయినా సరే.. కేసు ఫైల్ చేయాలని మరోసారి స్పష్టం చేసింది. ఇన్వెస్టిగేషన్ లోనే అసలు విషయాలు తెలుస్తాయి తప్పు మీకు మీరు FIR నమోదు చేయకుండా ఎలా నిర్ణయానికి వస్తారని పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.