వ్యాధుల బారిన పడ్డ పేదలకు అందజేసేందుకు కొనే మందులవి(Medicine). వాటిపై సరైన నియంత్రణ(Control) ఉండాలంటే ఆసుపత్రి ఇంఛార్జిలే బాధ్యత తీసుకోవాలి. సప్లయర్లు ఎలాంటి మందులు తెస్తున్నారు.. అవి నకిలీవా, అసలువా అన్న దానిపై నిఘా పెట్టాల్సింది సదరు హాస్పిటల్ ఇంఛార్జులే. పేదలకు అందించే నాణ్యమైన(Quality) మందుల కోసం ఏటా ప్రభుత్వం కోట్లల్లో ఖర్చు చేస్తుంది. ఇంతటి బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి కూడా అక్రమాలకు పాల్పడ్డాడో అధికారి. లక్షలకు లక్షలకు లంచం డిమాండ్ చేసి అది పుచ్చుకుంటున్న సమయంలో ACBకి దొరికిపోయి ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది.
ఇంఛార్జి సూపరింటెండెంట్
ఇంతటి అక్రమార్జనకు తెరలేపింది ఏదో చిన్న హాస్పిటల్ అనుకునేరు. అది జిల్లా ప్రధాన ఆసుపత్రి(District Govt General Hospital) కావడం అసలు విశేషం. నల్గొండ జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్ లో జరిగిందీ తతంగం. ఇంఛార్జి సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ లచ్చునాయక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ ACBకి పట్టుబడ్డారు. ఔషధాల టెండర్ కు అనుమతి ఇచ్చేందుకు ఈ డబ్బుల్ని డిమాండ్ చేశారు. డ్రగ్స్ సప్లయ్ చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న… గతంలో టెండర్ వేశారు. టెండర్ దక్కించుకున్న తర్వాత మందుల్ని రెగ్యులర్ గా సప్లయ్ చేస్తున్నారు.
నాన్ టెండర్ డ్రగ్స్ కోసమే…
అయితే నాన్ టెండర్(Non Tender) కింద కొన్ని డ్రగ్స్ తీసుకువస్తానంటూ చెప్పడంతో.. అలా చేసేందుకు లంచం ముట్టజెప్పాలన్న ఒప్పందం ఇద్దరి మధ్య జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఇందుకు గాను గతంలోనే బాధితుడు కొంత ముట్టజెప్పినా.. మళ్లీ సూపరింటెండెంట్ భారీగా అడగడంతో ACB అధికారుల్ని ఆశ్రయించాడు. లచ్చునాయక్ తన నివాసంలో డబ్బులు తీసుకుంటున్న సమయంలో… అప్పటికే అక్కడ రెడీగా ఉన్న అధికారులు ఒక్కసారిగా దాడి చేశారు. లచ్చునాయక్ ని అదుపులోకి తీసుకుని ఆ నగదును సీజ్ చేశారు.