ఆయన దగ్గర బాగా డబ్బుందని ముందుగానే స్కెచ్ వేసుకున్నారు. మరి అతణ్ని లైన్ లో పెట్టాలంటే ఏం చేయాలి.. గొడవ పెట్టుకోవాలి. అలా కావాలనే గొడవ స్టార్ట్ చేశారు. ఇంకేముంది వీళ్లేదో తింగరిగాళ్లు.. వీళ్లను వదిలిపెట్టేది లేదంటూ డబ్బు బ్యాగ్ గల వ్యక్తి దూకుడు పెంచాడు. ఈ దూకుడులో అసలు విషయం మరచిపోయాడు. గొడవకు దిగింది ముగ్గురూ యువకులే కావడంతో తొందరగా గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఇదే అదనుగా ఆ వ్యక్తులు కాస్తా రూ.4 లక్షలు గల బ్యాగ్ ను ఎత్తుకెళ్లారు. చివరకు చేసేది లేక బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారి దృష్టి మరల్చి రూ.4 లక్షలు చోరీ చేసిన సినీ ఫక్కీ తరహా ఘటన హైదరాబాద్ ఫిలింనగర్ లో జరిగింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన గౌతమ్ యాదవ్(32)తో ముగ్గురు వ్యక్తులు గొడవపడ్డారు. ఈ వాగ్వాదంలో గౌతమ్ యాదవ్ దృష్టి మరల్చి డబ్బుల బ్యాగ్ ఎత్తుకెళ్లారు. అయితే పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మెహిదీపట్నంకు చెందిన ఆటో డ్రైవర్ అప్రోచ్ ఖాన్(24), సయ్యద్ ఇబ్రహీమ్ ఖలీల్(20), పారామౌంట్ కాలనీలో ఉండే అహ్మద్ ఖాన్(20) ఈ నేరానికి పాల్పడ్డారు. ఆ ముగ్గురు నిందితులు కాలేజీ స్టూడెంట్స్ లా కనిపించడం, ఇంత పెద్ద చోరీకి పాల్పడటంతో వారి గత చరిత్రను పోలీసులు పరిశీలిస్తున్నారు. అందుకే అంటారు.. ఎవరితోనైనా మాట కలిపేముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలని. అది మాటయినా.. మనీ అయినా. లేదంటే అంతే సంగతులు.