నీటిపారుదల(Irrigation) శాఖలో సాధారణ స్థాయి అధికారి ఆస్తులు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. హైదరాబాద్ తోపాటు వివిధ జిల్లాల్లో పనిచేసిన AEE నికేశ్ కుమార్ కు భారీ స్థాయిలో ఆస్తులున్నట్లు ACB గుర్తించింది. ఈ రోజు తెల్లవారుజాము 5 గంటల నుంచే నికేశ్ నివాసాల్లో సోదాలు చేస్తున్నారు ACB అధికారులు. ఇప్పటికే కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోగా అందులో విల్లాలు, ఫాం హౌజ్ లు, ఓపెన్ ప్లాట్లు, కమర్షియల్ అపార్ట్మెంట్ల వివరాలున్నాయని తేల్చారు. రూ.20 కోట్ల దాకా ఆస్తులు ఉన్నట్లు గుర్తిస్తే బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.150 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 25 చోట్ల తనిఖీలు జరుగుతుండగా, ఈ ఏడాది మే నెలలో లక్ష రూపాయలు లంచం తీసుకుని జైలుకు వెళ్లిన నికేశ్.. బెయిల్ పై తిరిగివచ్చారు. అప్పట్నుంచి ఆయనపై ACB నిఘా పెట్టింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని నివాసంలో పెద్దయెత్తున తనిఖీలు చేస్తుండగా, ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర రాజధానితోపాటు చుట్టు పక్కల జిల్లాలైన ఆయన పనిచేసిన ప్రాంతాల్లో కోట్ల రూపాయలు కూడబెట్టారని ACB గుర్తించింది.