Published 27 Nov 2023
పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. భారీగా తరలిస్తున్న నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు రెండు జిల్లాల్లో అధికారుల బృందాల(Official Teams)కు రూ.11 కోట్ల నగదు దొరికింది. ఖమ్మం జిల్లాలో రెండు చోట్ల జరిపిన సోదాల్లోనే ఐటీ, EC ఫ్లయింగ్ స్వాడ్ అధికారులకు తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు చిక్కాయి. ముత్తుగూడెంలో రూ.6 కోట్లను స్వాధీనం చేసుకోగా.. పాలేరులో చేపట్టిన తనిఖీల్లో రూ.3.5 కోట్లు లభ్యమయ్యాయి. ఈ సొమ్మును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చెందిన నగదుగా అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ రెండు రోజులే అత్యంత కీలకం
పెద్దపల్లి జిల్లా రామగుండంలోనూ పెద్దయెత్తున డబ్బు దొరికింది. NTPC కృష్ణానగర్ లో కాంగ్రెస్ సంబంధిత ప్రచార కార్యాలయంలో నిల్వ ఉంచిన నగదును ప్రత్యేక తనిఖీ బృందాలు(Special Searches Teams)తోపాటు ఎలక్షన్ స్క్వాడ్ కు చెందిన అధికారులు స్వాధీనపరచుకున్నారు. పట్టుబడిన నగదును ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. ఈ రెండు రోజులు మరింత నిఘా పెడితే లోపల దాచిన నోట్ల గుట్టలు భారీయెత్తున బయటపడే అవకాశముంది. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ఇప్పటికే సోదాల్ని వేగవంతం చేసిన అధికారులు… మరో 48 గంటలు తీవ్రమైన దృష్టిసారిస్తే అక్రమ సొమ్ము మరింతగా వెలుగుచూడనుంది.