నిందితుల వద్ద పట్టుబడ్డ డ్రగ్స్ ను తన ఇంటిలో దాచుకుని పట్టబడ్డ SI కేసులో విస్తుబోయే నిజాలు బయటపడుతున్నాయి. ఆయన దాచిపెట్టిన మత్తు పదార్థాల విలువ రూ.2 కోట్ల దాకా ఉండొచ్చని పోలీసు ఉన్నతాధికారులే ఆశ్చర్యపోతున్నారు. పట్టుబడ్డ SI రాజేందర్.. సైబర్ క్రైమ్ తోపాటు మాదాపూర్ పోలీస్ స్టేషన్లోనూ పనిచేశారు. ఇప్పటికిప్పుడు వాటి విలువ బయటకు ప్రకటించకున్నా ఇంట్లో నిల్వ చేసిన డ్రగ్స్ విలువ భారీగానే ఉంటుందన్న నిర్ధారణకు వచ్చారు. గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో అవినీతి నిరోధక శాఖ ACBకి రాజేందర్ పట్టుబడ్డారు. ఈ కేసులో అతణ్ని డిపార్ట్ మెంట్ రీమూవ్ చేయగా.. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తాజాగా మళ్లీ రాయదుర్గం PSలోనే పనిచేస్తూ NDPS యాక్ట్ కింద అరెస్టయ్యారు.
ఎందుకు దాచుకున్నట్లు… పోలీసుల సీరియస్ ఇన్వెస్టిగేషన్
ఒక ఎస్ఐ అయి ఉండి రికవరీ చేసిన వస్తువుల్ని డిపార్ట్ మెంట్ కు అప్పగించాలన్న విషయం తెలిసి కూడా రాజేందర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి స్పెషల్ ఆపరేషన్ లో భాగంగా మహారాష్ట్రకు వెళ్లి మరీ నిందితుల వద్ద డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాంటి కేసులో పట్టుబడ్డ వస్తువుల్ని అప్పగించకపోవడం పోలీసు వ్యవస్థపైనే అప నమ్మకం కలిగే ప్రమాదం ఉందన్న అభిప్రాయానికి అధికారులు వచ్చారు.
టీమ్ సభ్యులకు దొరికిన వస్తువుల్ని ఉన్నవి ఉన్నట్లుగా ఇవ్వకపోతే బయటకు లీక్ అవుతుందన్న కనీస విషయాన్ని మరిచాడా లేక ఆ.. ఏం జరుగుతుందిలే అన్న ధీమాతో ఇదంతా చేశాడా అన్న విషయాలనూ ఆరా తీస్తున్నారు. ఇది తీవ్రమైన చర్యగా భావించి దీనికి కారకుడైన SIని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
మొత్తంగా ఇంత పెద్ద విలువ గల డ్రగ్స్ ను నిజంగానే దాచి పెట్టాడా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. ఫిజిక్ కోసం జిమ్ లో ఎక్కువ టైమ్ గడిపే రాజేందర్.. డ్రగ్స్ దాచడంపై పలు కోణాల్లోనూ అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఆయన ట్రాక్ రికార్డ్ కూడా సరిగా లేకపోవడంతో వివిధ యాంగిల్స్ లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు అంటున్నారు.