అసలే ఎండాకాలం.. భగభగమండే ఎండల్లో నోటికి కాస్త చల్లగా తగలాలన్న ఉద్దేశంతో ఐస్ క్రీం(Ice Cream) ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ పెట్టిన కొద్దిసేపటికే ఇంటికి పార్సిల్ వచ్చింది. ఇంకేముందు హిమ క్రీమును చల్లగా లాగించేస్తున్నాడు. అలా తింటూ ఉండగా ఒక మెత్తని వస్తువు పెదాలకు తగిలింది. కరిగిపోవాల్సిన దాంట్లో ఈ అసలు పదార్థమేంటా అని పరిశీలిస్తే… ఆ తర్వాత భయపడిపోవాల్సి వచ్చింది.
ఎక్కడంటే…
ముంబయి మలాడ్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల డాక్టర్ ఓర్లెమ్ బ్రెండన్ సెరాయో(Brendon Serrao) ఆన్ లైన్ యాప్ ద్వారా మూడు ఐస్ క్రీములు ఆర్డర్ పెట్టాడు. అందులో ఒకటి బటర్ స్కాచ్(Butter Scotch) ఉంది. దాన్ని తింటుండగానే ఒకటిన్నర సెంటీమీటర్ల వస్తువు అతడి పెదాల్ని తాకింది. తొలుత అదేదో అందులో కలిపిన కొత్త పదార్థమనుకున్నాడు. కానీ దాన్ని చూశాక మనిషి వేలు అని గుర్తించి ఉక్కిరిబిక్కిరయ్యాడు. దాన్ని అలాగే తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు.
ఎలా వచ్చింది…
ప్యాకింగ్ సమయంలోనే ఏదో జరిగి ఉంటుందని పోలీసు అధికారులు అంటున్నారు. దాన్ని సప్లై చేసిన యమ్మో కంపెనీ(Yummo Ice Cream Company)పై కేసు ఫైల్ చేశారు. బ్రెండన్ కుటుంబం ఈ ఐస్ క్రీంతోపాటు ఇంట్లో సరకుల్ని కూడా ఆర్డర్ చేసింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు మనిషి ఫింగర్ గల ఆ ఐస్ క్రీంను టెస్టుల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.