అది… అందరూ భోజనం(Lunch) చేసే టైమ్. స్టాఫ్ మెంబర్లతోపాటు కస్టమర్లతో ఉన్న కేఫ్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఏం జరిగిందో అర్థం కాక అక్కడున్న వాళ్లంతా అటూ ఇటూ పరుగులు తీశారు. ఈ ఘటన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో చోటుచేసుకుంది. ఇది IED బాంబుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ ఘటనలో కేఫ్ ఉద్యోగులు సహా మొత్తం తొమ్మిది మందికి గాయాలయ్యాయి.
బెంగళూరు వైట్ ఫీల్డ్ ప్రాంతంలోని బ్రూక్ ఫీల్డ్ ఏరియా కుందనహళ్లిలో రామేశ్వరం కేఫ్ ఉంది. అది పెద్ద బిజినెస్ సెంటర్ కావడం, పక్కనే సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉండటంతో అందులోని ఉద్యోగులు(Staff) లంచ్ కోసం కేఫ్(Cafe)కు వెళ్లారు. కర్ణాటక DGP అలోక్ మోహన్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అటు NIA, IB అధికారులు సైతం రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పేలుడుకు సంబంధించిన CC ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒక యువకుడు కేఫ్ లోకి వచ్చి బ్యాగ్ పెట్టి వెళ్లినట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. అతడు బ్యాగ్ పెట్టి వెళ్లిన తర్వాత గంటకు పేలుడు సంభవించింది. దీనిపై ఏడెనిమిది టీమ్ లు ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో గాలింపు చేపడుతున్నారు. పేలుడు తీవ్రత తక్కువగా ఉందన్న శివకుమార్.. బెంగళూరు వాసులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
ఈ ఘటనను BJP రాజకీయం చేయాలని చూస్తున్నదంటూ ఆ పార్టీపై డీకే శివకుమార్ విమర్శలు చేశారు. మరోవైపు రామేశ్వరం కేఫ్ లో బాంబ్ బ్లాస్ట్ పై NIA(National Investigation Agency)తో దర్యాప్తు జరిపించాలని కర్ణాటక కమలం పార్టీ డిమాండ్ చేసింది.