
అతి కొద్ది రోజుల్లోనే ఎన్నికలు(Elections) జరగనున్న దృష్ట్యా పోలీసులు నిఘాను పటిష్ఠం చేశారు. హైదరాబాద్ పురానాపూల్ వద్ద వాహనాలు చెక్ చేస్తుండగా.. పెద్దమొత్తంలో నగదు పట్టుబడింది. పట్టుబడిన రూ.35.50 లక్షల సొమ్మంతా హవాలా మనీగా గుర్తించి నిందితుల్ని అరెస్టు చేశారు. వెహికిల్స్ చెక్ చేస్తున్న టైమ్ లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదం(Suspected)గా కనిపించారు. మోటార్ సైకిల్ పై బ్యాగుతో వెళ్తున్న వారిని పరిశీలిస్తే అందులో రూ.18 లక్షలు కనిపించాయి. అత్తాపూర్ కు చెందిన రోహిత్ గిరి, ముషీరాబాద్ కు చెందిన హమీదుల్లా సరైన వివరాలు చెప్పకపోవడంతో పూర్తిస్థాయిలో ఎంక్వైయిరీ నిర్వహించారు.
చివరకు హమీదుల్లాకు చెందిన స్క్రాప్ గోదాంలో మరో రూ.17.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా హవాలా మనీగా గుర్తించామని హైదరాబాద్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. మొత్తంగా ఈ సోదాల్లో రూ.35.50 లక్షల్ని స్వాధీనం చేసుకుని నిందితుల్ని అరెస్టు చేశారు. తరలించే నగదుకు కచ్చితంగా లెక్కలు చూపాల్సి ఉంటుందని పోలీసులు అంటున్నారు.