వారిద్దరూ దంపతులు. జహాన్ జేబ్ సమి, హీనా బషీర్ బేగ్ అనే జంట జమ్మూకశ్మీర్ నుంచి 2019లో దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంది. ఆర్టికల్ 370 రద్దయిన సమయంలో 2019 అక్టోబరు 6న ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన రెండు వారాలకే ఢిల్లీకి మకాం మార్చారు. సమీ బీటెక్ తోపాటు MBA పూర్తి చేసి UK కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన భార్య బేగ్ కూడా MBA కంప్లీట్ చేశాక కంప్యూటర్ అప్లికేషన్స్ చదివి కొన్ని బ్యాంకుల్లో పనిచేసింది.
ఈ ఇద్దరి వయసు 30 ఏళ్లుగా ఉంటుంది. ఢిల్లీలోని జామియా నగర్ C బ్లాక్ లో రెంట్ కు ఉంటున్నారు. వీకెండ్స్ లో సినిమాలకు వెళ్లడం లేదా ఓక్లా ప్రాంతంలోని పక్షుల సంరక్షణ కేంద్రానికి వెళ్లడం అలవాటు. కానీ ఇది ఎంతోకాలం కొనసాగలేదు. కొవిడ్ పేరుతో ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యారు. 2020 మార్చి 8న ఢిల్లీ పోలీసుకు చెందిన యాంటీ-టెర్రర్ యూనిట్ వాళ్ల ఇంటి తలుపు కొట్టింది. ఆ వెంటనే ఆ ఇద్దర్నీ UAPA(Unlawful Activities(Prevention) Act) చట్టం కింద అరెస్టు చేసింది.
కట్ చేస్తే… ఈ ఇద్దరూ ఇంటర్నెట్ లో వివిధ పేర్లతో అకౌంట్లు నడిపిస్తున్నారు. జియాబ్, అబూ అబ్దుల్లా, అబూ మహ్మద్-అల్-హింద్ గా సమి… హనీబీ, కతీజా, కశ్మీరీ పేర్లతో బేగ్ చెలామణి అవుతున్నారు. కరడు గట్టిన ఉగ్ర సంస్థ ఐసిస్ ద్వారా ఈ జంట సిరియా, అఫ్గానిస్థాన్ కేంద్రంగా సాగుతున్న హుల్లాబలూకు అనుగుణంగా పని చేస్తున్నదని పోలీసులు గుర్తించారు. దీంతో 10 రోజులకే కేసును NIAకు అప్పగించారు ఢిల్లీ పోలీసులు. ఈ జోడీ వ్యవహారంపై పూర్తి కూపీ లాగిన NIA.. ఆ ఇద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టింది.
ఒక్కరోజులో 100 పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నిన కేసులో సమికి 3 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష పడితే, బేగ్ కు ఏడు సంవత్సరాల కారాగార శిక్ష(Sentenced) విధించింది కోర్టు. హనీబీ పేరుతో ఇంటర్నెట్ ద్వారా సమి-బేగ్ జరిపిన ఛాటింగ్(Chating)ను ఎన్ క్రిప్ట్ చేసిన పోలీసులు.. అసలు విషయాల్ని రాబట్టారు. వలియా అల్-హింద్ పేరిట ప్రత్యేకంగా భారత్ లో ఉగ్ర దాడులు జరిపేందుకు ఎంచుకున్న దారుల్ని గుర్తించారు. CAAను వ్యతిరేకించడం, స్థానిక యువతను ఉగ్రవాదంలోకి లాగడమే టార్గెట్ గా ఐసిస్-ఖొరాసన్ కు చెందిన అబూ ఉస్మాన్ అల్ కశ్మీరీతో టచ్ లో ఉన్నట్లు ఛార్జిషీట్ లో NIA వివరించింది.