మాజీ MP, ప్రస్తుత పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasreddy) అనుమానం నిజమైంది. తనపై దాడులు జరుగుతాయని ఆయన ప్రకటించిన 24 గంటల్లోనే చెప్పింది నిజంగా మారింది. పొంగులేటి ఇంటిపై IT, ED దాడులు జరుగుతున్నాయి. ఖమ్మంలోని ఆయన నివాసంతోపాటు కార్యాలయాల్లోనూ అధికారుల బృందాలు సోదాలు చేస్తున్నాయి. ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించిన అధికారులు.. అందరి ఫోన్లు స్వాధీనం చేసుకుని మరీ దాడుల్లో పాల్గొంటున్నారు. IT(Income Tax)తోపాటు ED(Enforcement Directorate)కు చెందిన 8 టీమ్ లు ఇందులో పాల్గొంటున్నాయి. 8 వాహనాల్లో వచ్చిన టీమ్ లు తెల్లవారుజామున 3 గంటలకు పొంగులేటి నివాసానికి చేరుకున్నాయి. ఖమ్మం, హైదరాబాద్, విజయవాడలోనూ రాఘవ కన్ స్ట్రక్షన్స్ కు చెందిన కంపెనీల్లో విస్తృతంగా సోదాలు నడుస్తున్నాయి.
తనపై దాడులు జరిగే అవకాశముందని, కాంగ్రెస్ ముఖ్య నాయకుల ఇళ్లు, ఆఫీసులపైనా రెయిడ్స్ ఉంటాయని నిన్ననే పొంగులేటి అన్నారు. ఆయన చెప్పిన గంటలోపే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఇంటిపై దాడులు జరిగాయి. ఇవాళ పొంగులేటి ఇళ్లు, ఆఫీసుల్లోనూ అధికారుల బృందాలు సోదాలు చేస్తున్నాయి. నేడు నామినేషన్ వేసేందుకు పొంగులేటి రెడీ అవుతున్న దశలో ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా మాజీ ఎంపీ నివాసానికి చేరుకుని గేట్లు ఎక్కి లోనికి వెళ్లేందుకు యత్నించారు.