రాష్ట్రంలో ఐటీ(Income Tax) అధికారుల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధానితోపాటు వివిధ జిల్లాల్లో ఇప్పటికే పలువురు లీడర్ల ఇళ్లు, కార్యాలయాల్లో దాడులు నిర్వహించిన అధికారులు.. ఈరోజు హైదరాబాద్ లోనూ భారీయెత్తున దాడికి దిగారు. 10 టీమ్ లు రంగంలోకి దిగి ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లు, ఆఫీసులు, ఉద్యోగులు నివాసాల్లో పెద్దయెత్తున తనిఖీలు చేస్తున్నాయి. రామచంద్రాపురంలోని నాగులపల్లి, అమీన్ పూర్ లోని పటేల్ గూడలో అణువణువు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అటు గచ్చిబౌలిలో మైహోమ్ భుజాలోనూ విస్తృతంగా సోదాలు జరుపుతున్నాయి.
ఎన్నికల సందర్భంగా ఇప్పటికే అనుమానం ఉన్న ప్రతి లీడర్ ఇంటిపైనా IT అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయపన్ను ఎగవేస్తూ భారీగా కూడబెట్టుకుంటున్నారన్న దానిపై ఆ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు నిఘా వేశారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న కంపెనీల టర్నోవర్, చెల్లిస్తున్న ఆదాయపన్ను వంటి వాటిని శోధించిన తర్వాతే టీమ్ లుగా విడిపోయి ఏ ఒక్కర్నీ వదలకుండా సోదాలకు దిగుతున్నారు. గత కొద్దిరోజులుగా హైదరాబాద్ తోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ యెత్తున సోదాలు జరిగాయి. ఇందులో BRS, కాంగ్రెస్ కు చెందిన లీడర్లతోపాటు వివిధ కంపెనీలకు చెందిన యజమానులు(Owners) ఎక్కువగా ఉన్నారు. అయితే ప్రముఖుల ఇళ్లల్లోనూ మరిన్ని సోదాలు జరగబోతున్నట్లు తెలుస్తున్నది.