ఆస్తి గొడవ… తండ్రి, కొడుకు మధ్య పగకు దారితీసింది. కుటుంబాన్నే అంతం చేయాలన్న కొడుకు కసి.. ముగ్గురు చుట్టాల్ని(Guests) బలి తీసుకుంది. ఈ విషాద ఘటన కర్ణాటకలో జరిగింది. నలుగురు వ్యక్తులను హత్య చేసిన ఘటనలో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల నుంచి కూపీ లాగితే అసలు డొంకంతా కదిలింది. కన్న కొడుకే రూ.65 లక్షలు సుపారీ ఇచ్చి ప్రాణాలు తీయించినట్లు బయటపడింది.
గడగ్-బెట్కెరి మున్సిపాల్టీ(Municipality) వైస్ ప్రెసిడెంట్ అయిన సునంద బెకలే, ఆమె భర్త ప్రకాశ్ బెకలే ఇంటికి ముగ్గురు వ్యక్తులు అతిథుల్లా వచ్చారు. వారు గాఢనిద్రలో ఉన్న వేళ శుక్రవారం అర్థరాత్రి 2:30 గంటల టైమ్ లో దారుణ హత్యకు గురయ్యారు. ఫస్ట్ ఫ్లోర్ లోని కిటీకీల్ని పగులగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించారు.
ప్రకాశ్ కు రెండు పెళ్లిళ్లు జరగ్గా అందులో మొదటి భార్యకు వినాయక్(31), దత్తాత్రేయ అనే ఇద్దరు కుమారులున్నారు. రెండో భార్య సునందకు కార్తీక్ అనే తనయుడున్నాడు. వీళ్లకు కర్ణాటక, మహారాష్ట్రల్లో ఆస్తులు(Properties) ఉన్నాయి. గడగ్ లోని సొంత ఇంట్లోనే ప్రకాశ్, సునంద, కార్తీక్ ను హత్య చేయడానికి ప్లాన్ చేశారు. కానీ సుపారీ తీసుకున్న దుండగులు గెస్ట్ లుగా వచ్చి నిద్రిస్తున్న పరశురామ్ హదీమణి, ఆయన సతీమణి లక్ష్మీబాయి, కుమార్తె ఆకాంక్ష ప్రాణాలు తీశారు. ఈ ముగ్గురి అరుపులు విన్న కార్తీక్.. కింది ఫ్లోర్ కి వచ్చి చూసేలోపు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
మొదటి భార్య కుమారుడు వినాయక్ పేరు మీద కొన్ని ఆసుల్ని రిజిస్టర్ చేశాడు తండ్రి. వాటిని అమ్మడానికి ట్రై చేసిన కొడుకును అడ్డుకున్నాడు తండ్రి ప్రకాశ్. వినాయక్ కూడా వీరితోనే కలిసి ఉంటున్నాడు. అయితే ముందుగా ఈ కేసులో ఇతణ్ని కాకుండా దత్తాత్రేయను అనుమానించారు పోలీసులు. బ్యాంకుల్ని, నగల దుకాణాల్ని మోసం చేసిన కేసులు ఉండటంతో దత్తాత్రేయే నిందితుడని భావించారు.
మూడు రోజుల డ్రామా అనంతరం దుండగుల్ని అరెస్టు చేసి విచారిస్తే అసలు విషయం తెలిసింది. ఈ హత్యలకు సుపారీ ఇచ్చింది దత్తాత్రేయ కాదని, అది వినాయక్ అని గుర్తించారు. ఈ విషయాల్ని నార్తర్న్ రేంజ్ I.G. వికాస్ కుమార్ తెలిపారు. ఫిరోజ్ నిషార్ అహ్మద్ ఖాజీ అనే కార్ల డీలర్, జైషాన్ మహబూబ్ అలీ అనే వ్యాపారితోపాటు 8 మంది హత్యలో పాల్గొన్నారు.