
మతాంతర పెళ్లికి సిద్ధపడి..
మందుకు అలవాటు పడి..
ప్రేమ మాయలో మైకం కోల్పోయి..
ఓ చెల్లి సాగించిన బాగోతం నివ్వెరపోయేలా చేసింది.
ప్రేమ గుడ్డిదే కాదు.. దాని మైకం కమ్మితే వావి వరుసలు కూడా ఉండవని రుజువైంది. తోడబుట్టిన అక్కనే పొట్టనబెట్టుకుని మానవత్వానికి మచ్చ తెచ్చింది ఓ చెల్లి. జగిత్యాల జిల్లా కోరుట్లలో వెలుగుచూసిన ఈ ఘటన.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కోరుట్ల పట్టణంలో నివసిస్తున్న బంక శ్రీనివాస్ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. ఆగస్టు 28 నాడు రాత్రి శ్రీనివాస్ రెడ్డి పెద్ద కూతురు దీప్తిని, చిన్న కూతురు చందన తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. జగిత్యాల SP భాస్కర్ తెలిపిన వివరాల మేరకు.. 2019లో హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ చదువుతుండగా… ఆమెకు హైదరాబాద్ కు చెందిన ఉమర్ షేక్ సుల్తాన్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ డిటెయిన్డ్ కావడం, చివరకు క్లాస్ మేట్స్ గా మారి ప్రేమకు దారితీయడంతో అప్పట్నుంటి రెగ్యులర్ గా కలుసుకుంటున్నారు. హత్య జరగడానికి 10 రోజుల ముందే చందన, ఉమర్ కోరుట్లలో కలుసుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని చందన కోరడంతో ఇప్పుడే వద్దని ఉమర్ చెప్పాడు. తన అమ్మానాన్నలు ఊరెళ్తున్నారని, నువ్వు రావాలని చెప్పడంతో ఆగస్టు 28న ఉమర్ కోరుట్లకు వెళ్లాడు.

ప్లాన్ లో భాగంగా వోడ్కా, బ్రీజర్ తీసుకురాగా అక్కాచెల్లెళ్లు ఇద్దరూ తాగి పడుకున్నారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో దీప్తి నిద్రపోయిందని భావించిన చందన.. ప్రియుణ్ని పిలిచింది. ఇంటి బ్యాక్ సైడ్ నుంచి ఇంట్లోకి ఉమర్ ఎంటర్ కాగా.. ఇద్దరూ కలిసి నగలు, డబ్బు తీసుకుంటున్న సమయంలో దీప్తి నిద్ర లేచింది. దీప్తి అరవడంతో తన దగ్గరున్న స్కార్ఫ్ తో చందన.. ఆమె మూతి, ముక్కుకు కట్టి సోఫాపై పడుకోబెట్టారు. అటు ఉమర్, చందన కలిసి మరో స్కార్ఫ్ ను ఆమెకు చుట్టారు. అయినా అరుపులు రావడంతో మూతికి ప్లాస్టర్ వేశారు. దీంతో 10 నిమిషాల్లో దీప్తి శ్వాస ఆడకుండా పడిపోయింది. అప్పుడు 70 తులాల బంగారం, రూ.1.20 లక్షల నగదును తీసుకుని పారిపోయే ముందు ప్లాస్టర్, స్కార్ఫ్ లన్నీ తీసివేశారు. అక్కణ్నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ చేరుకున్నారు. ఉమర్ ఇంట్లో నగలు, డబ్బు పెట్టేసి సేఫ్ జోన్ కోసం ముంబయి లేదా నాగపూర్ వెళ్దామనుకున్నారు. ఇది జరిగిన తెల్లారే చందన ఆడియో మెసేజ్ పెట్టడం, తాను హత్య చేయలేదని చెప్పడం, తండ్రి కంప్లయింట్ ఇవ్వడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.
చందన(A1), ఉమర్ షేక్(A2), సయ్యద్ అలియా మహబూబ్, షేక్ అతియా ఫాతిమా, హఫీజ్ ను అరెస్టు చేశారు. వారి నుంచి నగలు, నగదు, కారు స్వాధీనం చేసుకుని నిందితుల్ని రిమాండ్ కు తరలించారు. శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన కంప్లయింట్ తో తొలుత అనుమానాస్పద(Suspected) కేసుగా నమోదు చేయగా.. 5 టీమ్ లతో ఇన్వెస్టిగేషన్ కొనసాగించినట్లు SP తెలిపారు. నిందితులు ఆర్మూర్ బాల్కొండ రూట్లో గల దాబాలో ఉండగా పట్టుకున్నామన్నారు. ఇన్వెస్టిగేషన్ లో పాల్గొన్న టీమ్ లను ఆయన అభినందించారు. డబ్బు సంపాదించడమే కాదు.. అది కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపైనా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని దీని ద్వారా రుజువైంది.