కూకట్ పల్లి సంగీత్ నగర్ లో ఈనెల 18న జరిగిన పదేళ్ల బాలిక హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. చోరీకి వచ్చిన పదోతరగతి బాలుడు.. సహస్రను కిరాతకంగా హత్య చేశాడు. దొంగతనం ఎలా చేయాలో ముందే పేపర్ పై రాసుకుని వచ్చాడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తాక్యాసారం గ్రామానికి చెందిన కుటుంబం సంగీత్ నగర్లో ఉంటోంది. భర్త మెకానిక్ గా భార్య ప్రైవేటు ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. బోయిన్ పల్లి కేంద్రీయ విద్యాలయంలో సహస్ర.. ఆమె తమ్ముడు ఇంటి పక్కన గల బడిలో చదువుతున్నారు.
స్కూల్ కు సెలవుండటంతో పాప ఇంటి వద్దే ఉంది. తమ్ముడికి తానే లంచ్ బాక్స్ ఇస్తానని చెప్పి ఇంకా రాకపోవడంతో స్కూల్ సిబ్బంది ఆమె తండ్రికి ఫోన్ చేశారు. హడావుడిగా ఆయన ఇంటికి వెళ్లే సరికి కత్తిపోట్లతో మంచంపై చిన్నారి పడి ఉంది. ఆమె శరీరంపై 20 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది. ఐదు రోజులుగా దర్యాప్తు నిర్వహిస్తున్న అధికారులు బాలుణ్ని అదుపులోకి తీసుకున్నారు.