దేశాన్ని కుదిపేసి అత్యంత జుగుప్సాకర ఘటనగా నిలిచిన అజ్మీర్ సెక్స్ స్కాండల్ కేసులో రాజస్థాన్ పోక్సో కోర్టు ఆరుగురికి జీవితఖైదు విధించింది. అత్యాచారాలు(Gang Rapes), బ్లాక్ మెయిలింగ్స్ తో 100 మంది అమ్మాయిల జీవితాల్ని ఛిద్రం చేసిన కేసులో మంగళవారం తీర్పు(Verdict) వెలువడింది. నఫీస్ ఛిస్తీ, నసీమ్ అలియాస్ టార్జాన్, సలీమ్ ఛిస్తీ, ఇక్బాల్ భాటి, సోహైల్ ఘనీ, సయ్యద్ జమీర్ హుస్సేన్ కు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఫైన్ వేసింది.
‘అజ్మీర్ బ్లాక్ మెయిల్ కాండ’…
ఈ అజ్మీర్ గ్యాంగ్ రేప్ కేసును ‘అజ్మీర్ బ్లాక్ మెయిల్ కాండ’గా పిలుస్తారు. ఒకే కాలేజీకి చెందిన యువతుల్ని బ్లాక్ మెయిల్ చేయడం, ఆ తర్వాత గ్యాంగ్ రేప్ చేస్తూ వీడియోలు తీసిందా రాక్షసుల బృందం. అత్యాచారం చేసి ఫొటోలు, వీడియోలు తీశాక నగ్న చిత్రాలను ముద్రించిన ఫొటో ల్యాబే వాటిని ప్రచారం చేసింది. అలా డబ్బు సంపాదించి ఆ తర్వాత మళ్లీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాజకీయ జోక్యం, మత ప్రభావం వంటి కారణాలు దర్యాప్తుపై ప్రభావం చూపించాయి.
అప్పట్లో అల్లర్లు…
1992 ఏప్రిల్లో స్థానిక పత్రికలో వచ్చిన వార్త ద్వారా ఇది బయటపడింది. అజ్మీర్ షరీఫ్ దర్గాలో పనిచేసే వ్యక్తులకు సంబంధం ఉండటంతో కేసు వెలుగులోకి వచ్చిన టైంలో అక్కడ మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ కేసులో 18 మంది నిందితులుండగా, 9 మందికి ఇప్పటికే శిక్ష పడింది. ఒకడు సూసైడ్ చేసుకోగా, మరొకడు పరారయ్యాడు.
IAS, IPSల పిల్లలూ…
బాధితుల్లో మధ్యతరగతితోపాటు IAS, IPSల పిల్లలూ ఉండగా.. ఆ తర్వాత ఎన్నో కుటుంబాలు అజ్మీర్ నుంచి పారిపోయాయి. 3 దశాబ్దాల నుంచి కోర్టులు, పోలీసుల సమన్లు రావడంతో ఆయా కుటుంబాలు నిత్యం ఆవేదనతోనే ఉండేవి. గ్యాంగ్ రేప్ బాధితురాల్ని 2021లోనూ కోర్టుకు పిలిపించాల్సి రావడమే ఇందుకు ఉదాహరణ.