
గ్రౌండ్ ఫ్లోర్ లో అంటుకున్న మంటలు పై ఫ్లోర్లలోకి చేరుకోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. హైదరాబాద్ నాంపల్లిలోని బజార్ ఘాట్(Bazar Ghat) లో ఈ అగ్ని ప్రమాదం(Fire Incident) చోటుచేసుకోగా.. తొమ్మిది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు అంటుకుని నాలుగో అంతస్తు వరకు వ్యాపించాయి. అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో నిల్వ ఉంచిన డీజిల్ డ్రమ్ము లు మంటల బారిన పడగా, దట్టమైన పొగలు ఏర్పడి చాలా మందికి ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. 10 మంది కార్మికులు మంటల్లో చిక్కుకుని విలవిల్లాడారు. మూడు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతుండగా.. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోగా.. అందులో 4 రోజుల పసికందు ఉన్నట్లు గుర్తించారు. ఘటనాస్థలిలో SDRF, GHMC టీమ్ లు సహాయక చర్యలు చేపట్టాయి. గ్యారేజ్ లో ఉన్న మిగతా కెమికల్ డబ్బాలను బయటకు తీసుకువచ్చి.. 21 మందిని బిల్డింగ్ నుంచి కాపాడారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కార్లు, మోటార్ సైకిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
రెసిడెన్షియల్ బిల్డింగ్
గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం గ్యారేజీ ఉండగా.. పై ఫ్లోర్లలో కుటుంబాలు(Families) ఉంటున్నాయి. గ్యారేజీలో కారుకు రిపేర్ చేస్తుండగా స్పార్క్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ లోని డీజిల్ డ్రమ్ములకు అంటుకున్నాయి. సికింద్రాబాద్ లోని గతేడాది సెప్టెంబరులో రూబీ హోటల్లో, ఈ ఏడాది జనవరిలో దక్కన్ మాల్, మార్చిలో స్వప్న లోక్ కాంప్లెక్స్ లు ఫైర్ ఇన్సిడెంట్ బారిన పడి ప్రాణనష్టం జరిగింది.
గవర్నర్, సీఎం దిగ్భ్రాంతి
ప్రమాదంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి KCR దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మంచి వైద్యం అందేలా చూడాలని అధికారులను CM ఆదేశించారు.