మేడ్చల్ జిల్లా కండ్లకోయ CMR కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడకు భారీగా రావడంతో ఆందోళనకర వాతావరణం నెలకొంది. బాత్రూం వీడియోలు తీశారంటూ విద్యార్థినులు ఆగ్రహం చెందడంతో కాలేజీ వద్ద గొడవ మొదలైంది. బాత్రూం వెంటిలేటర్ పై చేతి గుర్తులు ఉండటంతో వారి అనుమానాలు నిజమేనా అన్న చర్చ మొదలైంది. హాస్టల్లో భద్రతపై స్టూడెంట్స్ తోపాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాము ఇచ్చిన ఆధారాల్ని పట్టించుకోకుండా తిరిగి తమపైనే అభాండాలు వేస్తున్నారంటూ మండిపడుతున్నారు. దీనిపై స్టూడెంట్స్ తోపాటు విద్యార్థి సంఘాలు సైతం కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు.
భద్రత విషయంలోనూ తమకు భయంగా ఉందని, దీనికి CMR కాలేజ్ మేనేజ్మెంట్ జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. పరిస్థితి చేయిదాటుతుండటంతో ACP శ్రీనివాస్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకున్నారు. వెంటిలేటర్ పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ ను పరీక్షలకు పంపించామని పోలీసులు చెబుతున్నారు. ఐదుగురు మెస్ సిబ్బందిపై అనుమానాలున్నాయని, వారందర్నీ అదుపులోకి తీసుకున్నామని ACP తెలిపారు. ఈ విషయంలో కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందన్నారు. అమ్మాయిల హాస్టళ్లపై నిఘా ఉండాలన్నది మరోసారి నిరూపించే ఘటన ఇది.