మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్ డేట్స్ కోసం justpostnews.com ఫాలో కాగలరు.
Published 10 Jan 2024
ఆమె చదివింది హార్వర్డ్ యూనివర్సిటీలోని డేటా అండ్ సొసైటీ విభాగం(Department)లో. ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ లో ప్రముఖమైన మొజిల్లా ఫైర్ ఫాక్స్(Mozilla Firefox)కు సంబంధించిన నిపుణురాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఎథిక్స్ లిస్ట్-2021కి సంబంధించిన టాప్-100 బ్రిలియంట్లలో చోటు దక్కిందామెకు. డేటా సైన్స్ అండ్ AI ఎథిక్స్ లో ఆమెకెవరు సాటిరారు. ప్రఖ్యాత రామకృష్ణ మిషన్ నుంచి సంస్కృతంలో ఫస్ట్ ర్యాంక్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సాధించడంతోపాటు నాలుగు భాషల్ని అనర్గళంగా మాట్లాడగల ఆ వివాహిత పేరు… సుచనా సేథ్. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. కానీ ఆమె చరిత్ర మరోవైపు చూస్తే దారుణంగా ఉంది. నాలుగేళ్ల తన తనయుణ్ని చంపి బ్యాగులో మూటగట్టుకెళ్తుండగా పట్టుబడింది.
ఆటోలో తీసుకెళ్తుండగా…
అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి తనయుణ్ని సుచనా సేథ్.. గోవాలోని ఓ హోటల్ లో ప్రాణాలు తీసి బ్యాగులో మూటగట్టింది. ఆ బ్యాగును విసిరేందుకు ఆటోలో వెళ్తుండగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె చరిత్రను ఆరా తీసిన పోలీసులకు ఆశ్చర్యకర నిజాలు కంటపడ్డాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథిక్స్ పై నడిచే ‘ద మైండ్ ఫుల్ ఎట్ ల్యాబ్’ అనే అంకుర(Startup) కంపెనీకి సుచనా సేథ్ యజమాని(Owner). లింక్డ్ ఇన్ లో ఆమె ప్రొఫైల్ చూసి గోవా పోలీసులు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. హార్వర్డ్ యూనివర్సిటీ పట్టా కలిగి టాప్-100లో నిలిచిన మహిళ… ఇంతటి ఘాతుకానికి ఎందుకు పాల్పడిందన్న కోణంలో దర్యాప్తు(Investigation) చేస్తున్నారు. కోల్ కతాలోని భవానీపూర్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజ్ నుంచి భౌతిక శాస్త్రం(Physics)లో 2006లోనే టాపర్ గా నిలిచింది. చిన్నప్పట్నుంచి చదువులో, ఆ తర్వాత ఉద్యోగంలో టాపర్ గా ఉన్న ఈ నిందితురాలు.. సొంత కొడుకునే ఎందుకు హత్య చేసిందన్న కోణంలో శోధన సాగిస్తున్నారు.
బెంగాల్ లో పుట్టి, కేరళలో…
పశ్చిమ బెంగాల్ లో పుట్టిపెరిగిన సుచనా సేథ్ కు కేరళకు చెందిన వెంకటరామన్ తో 2010లో వివాహమైంది. ఈ జంటకు 2019లో బాబు జన్మించగా.. అతడు పుట్టిన వెంటనే ఆ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. కర్ణాటకలోని చిత్రదుర్గలో నివాసం ఏర్పాటు చేసుకున్న ఆమె.. ప్రస్తుతం బెంగళూరులోని థనిసాండ్ర అపార్ట్ మెంట్లో ఉంటున్నారు. ‘మోస్ట్ బ్రిలియంట్ లేడీ’గా మన్ననలందుకున్న మహిళ.. నవమాసాలు మోసి కన్న తనయుణ్ని మానవత్వం మరచి పాశవికంగా హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమవుతోంది. మనువాడిన వాడితో మనస్పర్థలే ఇంతటి ఘాతుకానికి కారణమా.. లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. భర్తతో వేరుగా ఉంటున్నంత మాత్రాన కన్న కొడుకు చంపిన క్రూరురాలు అంటూ నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమెకు ఎన్ని డిగ్రీలు ఉంటే ఏంటి… ఎంతటి మేధావి అయితే ఏంటి… సభ్య సమాజం తలదించుకునేలా చేసి మేధావితనాన్ని గంగలో కలిపిందని విమర్శించడంలో తప్పేం లేదనాలి.