అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలుంటాయని ఇప్పటికే స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా కార్యాచరణ(Action Plan) మొదలు పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో పశు సంవర్ధక శాఖలో అవినీతికి పాల్పడ్డ కొందరు అధికారుల్ని ACB అధికారులు అరెస్టు చేశారు. గొర్రెల పంపిణీలో అవకతవకలకు(Frauds) పాల్పడ్డ నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురూ ప్రభుత్వ అధికారులు కావడం సంచలనంగా మారింది. అసిస్టెంట్ డిప్యుటీ డైరెక్టర్, డిప్యుటీ డైరెక్టర్, గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లను అరెస్టు చేశారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. ACB వలలో చిక్కిన ఆ నలుగురి పేర్లు రవి, ఆదిత్య, రఘుపతిరెడ్డి, గణేశ్.
పశుసంవర్ధక శాఖపై విచారణ…
పశుసంవర్ధక(Animal Husbandry) శాఖలో భారీగా అక్రమాలు, అవకవతకలు జరిగాయని ప్రభుత్వం ఇంతకుముందే గుర్తించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సెక్రటేరియట్ లో కీలక ఫైళ్లను దహనం చేసినట్లు గుర్తించారు. అగ్నిప్రమాదం(Fire Incident)లో ఫైళ్లు బుగ్గి అయ్యాయని చెప్పినా.. దానిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించి, కావాలనే ఇదంతా చేశారనే నిర్ణయానికి వచ్చింది సర్కారు. శాఖలో జరిగిన అక్రమాలపై విచారణకు ACBని రంగంలోకి దించింది. దీంతో దర్యాప్తు నిర్వహించిన అధికారులు.. పలువురు ఆఫీసర్లను అదుపులోకి తీసుకున్నారు.
గొర్రెల యూనిట్ల గోల్ మాల్…
గొర్రెల యూనిట్లలో గోల్ మాల్ కు సంబంధించి ఈ అరెస్టులు జరిగినట్లు ACB అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. 133 గొర్రెల యూనిట్లకు గాను రూ.2.10 కోట్లు దారి మళ్లించినట్లు దర్యాప్తు(Investigation)లో గుర్తించారు. రైతుల ఖాతాల్లో వేయాల్సిన నిధుల్ని బినామీ అకౌంట్లలోకి మళ్లించినట్లు తేల్చారు. పశు సంవర్ధక శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఇద్దరితోపాటు మరో ఇద్దరిని కలిపి మొత్తం నలుగురు అధికారుల్ని ఎక్కడికక్కడే ACB అధికారులు అరెస్టు చేశారు.
అరెస్టయిన ఆఫీసర్లు వీళ్లే…
వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్(AD) రవి, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(AD) ఆదిత్య, భూగర్భ జల(Ground Water) అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య డిప్యుటీ డైరెక్టర్ గణేశ్.. అరెస్టయిన వారిలో ఉన్నారు. గొర్రెలు కొనుగోలు చేసే బాధ్యతల్ని రవి, ఆదిత్య చూసినట్లు.. డబ్బుల్ని జమ చేసే ఇంఛార్జిలుగా రఘుపతిరెడ్డి, గణేశ్ ఉన్నట్లు ACB అధికారులు నిర్ధరణకు వచ్చారు. ఇందులో ప్రధాన నిందితుడు(Main Culprit)గా మొయిద్ అనే వ్యక్తిదే కీలకపాత్ర అని, ఇతడు ఇచ్చిన అకౌంట్లలోకే డబ్బుల్ని పంపినట్లు ఇన్వెస్టిగేషన్ లో గుర్తించారు.