అతడో అసిస్టెంట్ ఇంజినీర్. రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ(Minor Irrigation)లో మంచి ఉద్యోగం. వచ్చిన జీతం చాలదన్నట్లు సులువైన సంపాదన కోసం(Easy Earning) కోసం అడ్డదారుల్లోకి వెళ్లాడు. కోట్లకు కోట్లు డబ్బులు వస్తాయన్న ఆశతో ఆన్ లైన్(Online) ద్వారా బెట్టింగ్ కాశాడు. కానీ అది బెడిసికొట్టి ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోవడంతోపాటు చివరకు ఆయన అర్ధాంగి ఆత్మహత్య(Suicide) చేసుకునే స్థాయికి వెళ్లింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
ఊడ్చేస్తున్నా మారక…
కర్ణాటక చిత్రదుర్గలోని హోసదుర్గకు చెందిన అసిస్టెంట్ ఇంజినీర్(AE).. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లో రూ.1.5 కోట్లు పెట్టాడు. భార్య ఎంత చెప్పినా వినకుండా బెట్టింగ్ ఆడుతూనే ఉన్నాడు. ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోతూ నయా పైసా రాకున్నా అతడి తీరు మారలేదు. దీంతో చెప్పీచెప్పి విసిగిపోయిన ఆయన భార్య.. పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోగా, బయటి నుంచి ఒత్తిళ్లు(Pressures) ఎక్కువయ్యాయి.
ఒత్తిళ్లకు తట్టుకోలేక…
పెట్టిన డబ్బంతా అటే పోతుండగా.. ఒకటిన్నర కోట్ల రూపాయల మేర బెట్టింగ్ కాస్తే అందులో కొంత బాకీ పడ్డాడా ఇంజినీర్. ఇవ్వాల్సిన మిగతా సొమ్ము ఇవ్వాలంటూ బెట్టింగ్ రాయుళ్లు ఫోన్లు చేసి బెదిరించారు. ఈ ఒత్తిళ్లకు తట్టుకోలేని ఆ ఇంజినీర్ భార్య రంజిత.వి.. హోళికేరిలో గల తన నివాసంలోని బెడ్ రూమ్ లో ఈ నెల 19న ఆత్మహత్య చేసుకున్నారు. భర్త దర్శన్ బాలు చేస్తున్న వ్యవహారాల వల్లే తన కుమార్తె సూసైడ్ చేసుకుందంటూ ఆమె తండ్రి ఎం.వెంకటేశ్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు.