Published 22 Dec 2023
వాహనాలు వక్రమార్గంలో వెళ్తే చలాన్లు పడటం.. ఆ చలాన్లు తప్పించుకునేందుకు మళ్లీ అడ్డదారుల్లో వెళ్లటం.. ఇక ఇలాంటి తిప్పలు తప్పనున్నాయి. పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు డిస్కౌంట్ విధానాన్ని పోలీసు శాఖ మరోసారి అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటిదాకా పోలీసులే వెంటపడి మరీ చలాన్లు వసూలు చేసేవారు. కానీ ఈ ఆఫర్ తో ఇక పోలీసుల వెంటే వాహనదారులు పడే అవకాశముంది. గతంలో ఇచ్చిన ఆఫర్ కు రాష్ట్రంలో విశేష స్పందన వచ్చింది. ఈసారి కూడా అదే తీరులో చలాన్లు క్లియర్ అవుతాయని, భారీస్థాయిలో పేరుకుపోయిన బకాయిలు తిరిగి వస్తాయని పోలీసు శాఖ భావిస్తున్నది. అయితే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఈ సారి జిల్లాలపై ఫోకస్ పెట్టేలా పోలీసు శాఖ ఆదేశాలిచ్చింది.
ఎప్పట్నుంచి అమలు…
పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు డిస్కౌంట్ విధానం అమలు కానుంది. ఆ రోజు నుంచే వాహనాలపై ఉన్న చలాన్లను చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లకు అత్యధికంగా 90 శాతం రాయితీ ఇస్తున్నారు. ఇక టూవీలర్లకు 80%, ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలు(Four Wheelers)కు 60% రాయితీ ఉంటుంది. అటు భారీ వాహనాల(Heavy Vehicles)కు 50 శాతం రాయితీ ఇస్తున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్లకు పైగా చలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆన్ లైన్ తోపాటు మీసేవ కేంద్రాల్లోనూ క్లియర్ చేసుకోవచ్చు.