Published 29 Nov 2023
అసలే ఎన్నికల కాలం.. ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి.. ముఖ్యంగా అధికారులు. ఏ మాత్రం తేడా వచ్చినా ఇక అంతే సంగతులు. ఇంతటి సీరియస్ వాతావరణంలోనూ ముగ్గురు పోలీసులు అధికారులు(Police Officials) అజాగ్రత్తగా వ్యవహరించారు. చేసిన తప్పిదానికి ఆ ముగ్గురిపై చివరకు సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలో డబ్బును రికవరీ చేసుకున్న వ్యవహారంలో పూర్తి నిర్లక్ష్యంగా పనిచేశారంటూ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిగిన ఘటనపై దృష్టిపెట్టిన EC.. ఆ ముగ్గురి వ్యవహారశైలిపై నివేదిక తెప్పించుకుంది. పక్షపాతం చూపించి విధి నిర్వహణలో అలసత్వం(Neglegence) చూపించారంటూ సెంట్రలో జోన్ DCP వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ACP యాదగిరి, ముషీరాబాద్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ జహంగీర్ ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. వీరి స్థానాల్లో హుటాహుటిన ముగ్గురు కొత్త అధికారులకు బాధ్యతలు కట్టబెట్టారు.
అధికార పార్టీది అని తెలిసినా…
ఎన్నికల తనిఖీల్లో భాగంగా నిన్న ముషీరాబాద్ లో పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. సంతోష్ ఎలైట్ అపార్ట్ మెంట్ పై దాడులు నిర్వహిస్తే రూ.18 లక్షలు పట్టుబడ్డాయి. ఈ నగదు అక్కడి BRS అభ్యర్థి ముఠా గోపాల్ తనయుడు జైసింహకు చెందినదిగా గుర్తించారు. డబ్బు వారిదేనని నిర్ధారణకు వచ్చినా చివరకు FIRలో మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు(Unknown Persons)గా నిందితుల పేర్లు ఫైల్ చేశారు. అలా పేర్లు ఫైల్ చేస్తూనే ముఠా గోపాల్ స్నేహితులైన సంతోష్, సుధాకర్ ను అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను వదిలేయడంతోపాటు సరైన సెక్షన్లు పెట్టలేదంటూ ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. CI జహంగీర్, ACP యాదగిరి, DCP వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాల్సిందిగా చీఫ్ సెక్రటరీ(CS)కి EC లేఖ రాసింది. EC ఆదేశాల మేరకు ఈ ముగ్గురిని సస్పెండ్ చేశారు.
ముగ్గురు అధికారులకు బాధ్యతలు
DCP వెంకటేశ్వర్లు స్థానంలో సెంట్రల్ జోన్ DCPగా డి.శ్రీనివాస్ ను నియమించారు. ప్రస్తుతం శ్రీనివాస్.. హైదరాబాద్ ట్రాఫిక్ DCP-3గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అటు ACP యాదగిరి స్థానంలో చిక్కడపల్లి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా మధుమోహన్ రెడ్డిని, ముషీరాబాద్ CI జహంగీర్ స్థానంలో అదే స్టేషన్ లో DIగా పనిచేస్తున్న వెంకట్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.