Published 28 Dec 2023
అసలే గట్టి పోలీసు కమిషనర్లు.. తిక్క తిక్క వేషాలు వేస్తే ఇక ఊరుకుంటారా మరి. తప్పు చేసినట్లు తేలితే చాలు.. ఎడాపెడా చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. బాధ్యతలు చేపట్టిన 10 రోజుల్లోనే పలువురు అధికారులపై చర్యలు తీసుకున్న CPలు.. ఇప్పుడు మరికొందరిపై దృష్టి సారించినట్లున్నారు. సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్ పెక్టర్లను(CI) సస్పెండ్ చేస్తూ CP అవినాశ్ మహంతి ఆదేశాలిచ్చారు. KPHB(కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు) CIతోపాటు ఎయిర్ పోర్టు(RGI) పీఎస్ ఇన్స్ పెక్టర్ ను సస్పెండ్ చేశారు. కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిన ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ పై… ఓ దంపతుల కేసులో భర్తను చితకబాదారంటూ KPHB ఇన్స్ పెక్టర్ వెంకట్ పైనా వేటు వేశారు. పోలీసులు కొట్టడంతో ప్రణీత్ అనే వ్యక్తి హాస్పిటల్ పాలయ్యాడు. దీనిపై బాధితుల కంప్లయింట్ మేరకు విచారణ చేయించిన సీపీ.. తప్పు జరిగిందని భావిస్తూ చర్యలు తీసుకున్నారు.
కంటిన్యూగా కఠిన చర్యలు…
హైదరాబాద్ మహా నగరం పరిధిలోని కమిషనరేట్లలో కంటిన్యూగా పోలీసు అధికారులపై వేటు పడుతోంది. ఒకే రోజులో సీఐ, ఎస్సైపై CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వేటు వేయగా.. ఆయన ఆదేశాలతో మరో IPSనే ఏకంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ లోకి కారు దూసుకెళ్లిన కేసులో మాజీ ఎమ్మెల్యే తనయుడిని తప్పించారంటూ పంజాగుట్ట CI దుర్గారావును మంగళవారం నాడు సస్పెండ్ చేశారు. ఇదే కేసులో ఎస్సైతోపాటు కానిస్టేబుళ్లపైనా తీవ్రస్థాయిలో ఎంక్వయిరీ జరిగింది. అటు స్టేషన్ కు వచ్చిన యువతితో అసభ్యంగా ప్రవర్తించారన్న ఫిర్యాదుతో మియాపూర్ SI గిరీశ్ కుమార్ ను సైబరాబాద్ CP సస్పెండ్ చేశారు. ఈ రెండు సస్పెండ్ లు ఒకే రోజు జరిగాయి. ఇప్పటికే విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటం, నేరాల్లో పాల్గొనడం వంటి కారణాలతో హైదరాబాద్ కమిషనరేట్లో ఎనిమిది మందిపై కేసులు ఫైల్ కాగా.. మరో ఏడుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇక తిక్క తిక్క వ్యవహారాలతో ఉన్న 50 మందిపై విచారణ కూడా జరుగుతోందని స్వయంగా సీపీయే తెలియజేశారు.
ఐపీఎస్ అయినా.. ఎవరైనా…
తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలేదన్న మాటలు తరచూ వినపడుతుంటాయి. కానీ ఆచరణలో అది అమలు చేయడం అసాధ్యంగా ఉంటుంది. కానీ హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్ల విషయంలో మాత్రం దీనిపై అనుమానాలే ఉండవు. ఎంక్వయిరీల పేరుతో టైమ్ వేస్ట్ చేయడం జాన్తా నై అన్నట్లు.. రోజుల తరబడి కాలయాపన చేయకుండా వేగంగా విచారణ చేసి చర్యలు తీసుకుంటున్నారు. రిటైర్డ్ IAS భన్వర్ లాల్ ఇంటికి సంబంధించి ఫోర్జరీ సర్టిఫికెట్లు సృష్టించారన్న ఆరోపణలపై IPS అధికారి, తెలంగాణ పోలీస్ అకాడెమీ డిప్యుటీ డైరెక్టర్ అయిన నవీన్ కుమార్ ను CCS పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. ఇలా పోలీసు శాఖలో వరుసగా చోటుచేసుకుంటున్న పనిష్మెంట్లు తప్పు చేసిన వారిని గడగడలాడిస్తున్నాయి. ఇలా హైదరాబాద్, సైబరాబాద్ సీపీలు శ్రీనివాస్ రెడ్డి, అవినాశ్ మహంతి పోలీసు డిపార్ట్ మెంట్ ను సరైన దిశలో నడిపిస్తూ తప్పు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు.