Published 17 Dec 2023
కొత్త డైరెక్టర్ అడుగుపెట్టారో లేదో అప్పుడే దాడులు మొదలయ్యాయి. గంజాయి, మాదకద్రవ్యాల(Drugs)కు కేంద్రాలుగా మారుతున్న పబ్ లపై దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీల్లోని పబ్ లను పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మాదకద్రవ్యాల ఇల్లీగల్ దందాపై దృష్టి పెట్టారు. విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్న డ్రగ్స్ ను కట్టడి చేయాలంటూ తొలి సమావేశంలోనే హెచ్చరికలు పంపారు. ఓన్లీ వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఆ విభాగానికి(Department) ముఖ్యమైన సీనియర్ అధికారిని నియమించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో హైదరాబాద్ CPగా నియమితులైన సందీప్ శాండిల్యను.. రేవంత్ సర్కారు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ గా నియమించింది. ఈయన బాధ్యతలు చేపడుతూనే దాడులకు వ్యూహరచన చేశారు. అన్ని పబ్ లలో డ్రగ్స్ కోసం వెతుకుతున్న పోలీసులు.. స్నిఫర్ డాగ్స్ తో తనిఖీలు చేపడుతున్నారు.
పబ్బుల్లోనే విచ్చలవిడి దందా
ఉల్లాసానికి కారణమవ్వాల్సిన పబ్ లు విచ్చలవిడితనానికి మారుపేరుగా నిలుస్తున్నాయి. శ్రీమంతుల పిల్లల్లో చాలా మంది పబ్ లకు వెళ్లడం, అక్కడ డ్రగ్స్ తీసుకోవడం, దాన్ని పది మందికి పరిచయం చేయడం.. ఇలా పెద్దస్థాయిలో అక్రమ వ్యాపారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో దీన్ని చూసీచూడనట్లుగా వదిలేశారని, దీంతో మత్తుపదార్థాలు కాలేజీల వరకు చేరుకున్నాయన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమతోపాటు రాజకీయ రంగంలోని వ్యక్తుల పిల్లలు వీటికి బానిసలుగా మారుతున్నారు. నైజీరియన్ ముఠాల నుంచి డ్రగ్స్ ను దిగుమతి చేసుకుని వాటిని అమ్మేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ లో గ్యాంగ్ లు తయారయ్యాయి. మొన్నటి ఆగస్టు 31న మాదాపూర్ లో వెలుగుచూసిన వ్యవహారంలో సినీ ఫైనాన్షియర్ తోపాటు కథానాయకుడు నవదీప్ ను సైతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు.