నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ జగిత్యాల జిల్లాలో పలు ప్రైవేటు ట్రావెల్స్, ఏజెన్సీలపై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. వివిధ పట్టణాల్లో సోదాల ద్వారా 101 పాస్ పోర్ట్ లను సీజ్ చేసి, 300 డాక్యుమెంట్లను స్వాధీనం(Recovery) చేసుకున్నారు. ట్రావెల్స్, ఏజెన్సీల్లో భారీయెత్తున దోపిడీ జరుగుతోందన్న ఆరోపణలతో జిల్లా SP భాస్కర్ ఆదేశాల మేరకు.. పోలీసులు ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొన్ని ట్రావెల్స్ ను సీజ్ చేసినట్లు SP భాస్కర్ ప్రకటించారు. స్వాధీనం చేసుకున్నవాటిలో అక్రమాలు గుర్తించి అందుకు సంబంధించిన కేసులు నమోదు చేస్తామని, రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు తేలిన వారిపై అవసరమైతే PD యాక్టులకు కూడా వెనుకాడబోమని వార్నింగ్ ఇచ్చారు. ఫారిన్ ఆశతో నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని, ఎలాంటి పర్మిషన్ లేని ట్రావెల్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని చెబుతున్నారు. రెగ్యులర్ గా అమాయకులను బుట్టలో పడేస్తూ మోసాల పాలు చేస్తున్న ఏజెంట్లను కాకుండా గవర్నమెంట్ పర్మిషన్ ఉన్న వాటిని మాత్రమే ఆశ్రయించాలని సూచించారు. రూల్స్ పాటించని ఏజెన్సీలను రద్దు చేస్తున్నామని, క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తామని SP భాస్కర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
జగిత్యాల జిల్లా కేంద్రంతోపాటు కోరుట్ల, మెట్ పల్లి, ధర్మపురి, మల్యాలలో దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలియజేశారు. గల్ఫ్ దేశాలకు పంపేందుకు జగిత్యాల పరిసర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది ఏజెంట్లను ఆశ్రయిస్తుంటారు. వారి నుంచి రూ.లక్షన్నర నుంచి రూ. రెండు లక్షలకు పైగా వసూలు చేస్తూ కంపెనీ వీసాలు కాకుండా విజిట్ వీసాలు కట్టబెడతారు. అక్కడకు వెళ్లినవారంతా ఆ ఊబిలో చిక్కుకుని విలవిల్లాడుతారు. పోలీసులు నిర్వహించిన ఈ డ్రైవ్ వల్ల ఎంతోమందికి మేలు జరిగే అవకాశం ఉంది. జిల్లాలో మరిన్ని దాడులు చేస్తే ఇంకా ఎక్కువగా అక్రమాలు బయటపడే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. తద్వారా అసలైన ఏజెంట్లకు ఆదాయంతోపాటు గుర్తింపు లభిస్తుందంటున్నారు. దాడుల్ని స్వయంగా ఎస్పీయే పర్యవేక్షించారు.