అవి మహిళా ఖైదీలు శిక్షలు అనుభవిస్తున్న కారాగారాలు(Jail).. కానీ అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆ జైళ్లల్లో 196 మంది గర్భం(Pregnancy) దాల్చారు. ఇది ఎలా జరిగిందన్నది ఎవరికీ అంతబట్టకపోగా.. ఇప్పటికే 196 మంది శిశువులు ఆ కారాగారాల్లోనే కన్ను తెరిచారు. అత్యంత ఆసక్తికరం(Very Interesting)గా మారిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ విషయం అక్కడా ఇక్కడా కాదు.. ఏకంగా ఉన్నత న్యాయస్థానంలో(High Court)నే బయటపడింది. ఇంకేముంది.. ఏం జరిగిందో తెలియజేయాలంటూ విచారణకు కోర్టు ఆదేశించింది. ఇలాంటి విచిత్ర ఘటన పశ్చిమబెంగాల్ లో వెలుగుచూసింది.
మహిళా ఖైదీలుండే జైలులో…
పశ్చిమబెంగాల్ లో కరెక్షన్ హోమ్ లుగా పిలుచుకునే మహిళా కారాగారాల్లో పెద్దసంఖ్యలో ప్రసవాలు జరిగినట్లు కలకత్తా హైకోర్టు దృష్టికి వచ్చింది. అమికస్ క్యూరీ(కోర్టు సహాయకుడు) తపస్ భాంజా ఈ విషయాన్ని చీఫ్ జస్టిస్ వద్దకు తీసుకెళ్లారు. మహిళా ఖైదీల్లో 196 మంది గర్భం దాల్చి ప్రసవం కూడా అయినట్లు అమికస్ క్యూరీ(Amicus Curiae) తెలియజేశారు. అయితే ఇది ఎలా జరిగిందన్నది అంతుబట్టడం లేదంటూ విన్నవించారు. సదరు కరెక్షన్ హోమ్స్ లో ఎలాంటి వైద్య సౌకర్యాలు లేని పరిస్థితుల్లోనే 196 ప్రసవాలు జరిగాయని చెప్పారు.
చీఫ్ జస్టిస్ సీరియస్…
అమికస్ క్యూరీ రిపోర్టు చూసి కలకత్తా హైకోర్టు నివ్వెరపోయింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలంటూ అమికస్ క్యూరీనే ఆదేశించింది. బెంగాల్ కరెక్షన్ హోమ్స్ లో పురుష ఉద్యోగుల్ని అనుమతించొద్దంటూ కోర్టును కోరుతూ భాంజా అసలు విషయాన్ని న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ టి.ఎస్.శివజ్ఞానం, జస్టిస్ సుప్రతీమ్ భట్టాచార్య నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం(Devision Bench).. కేసును సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్లల్లో పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించి వెంటనే నివేదిక ఇవ్వాలంటూ అమికస్ క్యూరీని ఆదేశించింది.
ఒకే హోమ్ లో 15 మంది…
అలీపూర్ జైలులోనే 15 మంది శిశువులు జన్మిస్తే అందులో 10 మంది మగ, ఐదుగురు ఆడ పిల్లలు ఉన్నారని భాంజా తెలిపారు. ఈ పరిణామంతో ఇక నుంచి మహిళా ఖైదీలందరికీ ప్రెగ్నెన్సీ టెస్టులు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా జైళ్లల్లో మహిళా ఖైదీల సంఖ్య బాగా పెరిగిపోయింది. దీంతో రద్దీ తట్టుకోలేక అందులో కొంతమందిని కరెక్షన్ హోమ్స్ పేరిట వాటిల్లో ఉంచేందుకు తరలిస్తున్నారు. డమ్ డమ్ జైల్లో 400 మంది ఖైదీలతో రద్దీ ఏర్పడితే అందులో 90 మందిని అలీపూర్ లోని కరెక్షన్ హోమ్స్ కి తరలించారు. ఈ కేసుపై ధర్మాసనం సోమవారం నాడు మరోసారి విచారణ చేపట్టనుంది.
Published 09 Feb 2024