హైదరాబాద్ గచ్చిబౌలి రాడిసన్ హోటల్ లో జరిగిన మత్తుపదార్థాల(Drugs) పార్టీలో.. సినీ పెద్దల ప్రమేయం బయటపడుతున్నది. CC కెమెరాల ఫుటేజీల్ని డిలీట్ చేసిన వ్యవహారంపై ఇప్పటికే సీరియస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. ప్రధాన నిందితుడు(Main Accused) గజ్జల వివేకానంద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న సయ్యద్ అబ్బాస్ అలీ అనే వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నారు. వీరి మొబైల్ ఫోన్లలో డిలీట్ చేసిన డేటాపైనా దృష్టిపెట్టారు. అటు కీలక సూత్రధారిగా భావిస్తున్న వివేకానంద డ్రైవర్ ను అరెస్టు చేసి మరిన్ని వివరాలు రాబట్టేందుకు టీఎస్ న్యాబ్ పోలీసులు రెడీ అయ్యారు.
వాంగ్మూలం ద్వారా తేనెతుట్టె…
మీర్జా వహీద్ అనే వ్యక్తి దగ్గర సయ్యద్ అబ్బాస్ తీసుకువచ్చే కొకైన్ ను డ్రైవర్ ప్రవీణ్ ద్వారా అందరికీ చేరవేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడుతోంది. సయ్యద్ అబ్బాస్ ఇచ్చిన వాంగ్మూలం ద్వారా ముఖ్యమైన విషయాలు బయటపడుతున్నాయి. తన డ్రైవర్ తెచ్చే మత్తు పదార్థాల్ని స్వయంగా వివేకానంద్ తీసుకుంటూ సినీ పెద్దలుగా పేరుపడ్డ తలకాయలకు చేరవేస్తున్నట్లు గుర్తించారు. రఘుచరణ్, సందీప్, శ్వేత, నీల్, యూట్యూబర్ లిషి కోసం పోలీసుల వేట కొనసాగుతున్నది. గ్రాము కొకైన్ ను రూ.14 వేలకు కొన్నట్లు, ఏడాది కాలంగా ఇదే దందా నడుస్తున్నట్లు తేల్చారు.
ఫేమస్ డైరెక్టర్ సైతం…
రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీలో ప్రముఖ డైరెక్టర్ క్రిష్ కూడా పాల్గొన్నారు. ఈ కేసుపై ఇప్పటికే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో విచారణ జరుగుతుండగా అటు క్రిష్ కు ఇప్పటికే 160 కింద నోటీసులు ఇచ్చారు. రాడిసన్ హోటల్ లో 200 కెమెరాల దాకా ఉంటే అందులో 20 కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. గజ్జల వివేకానంద్ నిర్వహించే డ్రగ్స్ పార్టీలకు సినీ పెద్దలు తరచుగా అటెండ్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అందుబాటులో లేనని చెప్పిన క్రిష్… మార్చి 1న టచ్ లోకి వస్తానని పోలీసులకు తెలిపారు. డైరెక్టర్ క్రిష్ విచారణకు వస్తే మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది.
‘గమ్యం’తో హిట్ డైరెక్టర్ గా…
2008లో తీసిన ‘గమ్యం’ సినిమాతో జాగర్లమూడి రాధాక్రిష్ణ(క్రిష్) తెలుగు ఇండస్ట్రీలో ప్రస్థానం ప్రారంభించారు. 2010లో అల్లు అర్జున్, అనుష్క వంటి స్టార్లతో తీసిన ‘వేదం’ మూవీ ఎంతటి హిట్ సాధించిందో చూశాం. ఆ తర్వాత జర్మనీ నాజీల ఆధారంగా 2015లో విడుదల చేసిన ‘కంచె’ సినిమా.. నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నిలిచింది. ‘వానమ్’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’, ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’, కంగనా రనౌత్ తో’మణికర్ణిక(ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ)’, పవన్ కల్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ సినిమాలతో స్టార్ డైరెక్టర్ కీర్తిని పొందారు.