Published 22 Nov 2023
స్టేడియం నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారంటూ మాజీ క్రికెటర్ల ఇళ్లపై ఈడీ(Enforcement Directorate) దాడులకు దిగింది. ఇందులో ఇద్దరు క్రికెటర్లు ఉండగా, మరొకరు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు.
హెచ్.సి.ఎ.(Hyderabad Cricket Association) మాజీ అధ్యక్షుడు వినోద్ నివాసంలో ED అధికారుల బృందాలు సోదాలు చేశాయి. అటు మాజీ క్రికెటర్లు, భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శివలాల్ యాదవ్, అర్షద్ ఆయూబ్ ఇళ్లపైనా ఏక కాలంలో సోదాలు జరిగాయి.
ముగ్గురికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ వివరాలతోపాటు పలు ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ముగ్గురిపై ఆరోపణలున్నాయి.
దీనిపై ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ(ACB) కేసులు ఫైల్ చేసింది. ACB నమోదు చేసిన మూడు కేసుల ఆధారంగా ED దాడులకు దిగింది.
ఒప్పందం మేరకు కాకుండా ఉప్పల్ స్టేడియంలో తాము అనుకున్నట్లుగా నిర్మాణాలు చేపట్టారని ఈ ముగ్గురిపై ఆరోపణలున్నాయి. 2013లో ఉప్పల్ స్టేడియం నిర్మాణం జరిగింది. కమర్షియల్ నిర్మాణాలకు ఉప్పల్ స్టేడియంలో అనుమతులు లేకున్నా ఒప్పందాన్ని ఉల్లంఘించి స్టాండ్ లను ఏర్పాటు చేశారన్నది ప్రధాన ఆరోపణ.