
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో 12 సంవత్సరాల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో బాలిక రక్తమోడుతూ గత సోమవారం నాడు ఉజ్జయిని వీధుల్లో తిరుగుతూ కనిపించిన సంగతి తెలిసింది. దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ఇష్యూను సీరియస్ గా తీసుకున్నారు. దుండగుల్ని వెంటనే పట్టుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధిత బాలికను ఇండోర్ లోని హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తుండగా.. మెల్లమెల్లగా కోలుకుంటున్నదని డాక్టర్లు తెలిపారు. మహాకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో నిందితుడైన ఆటోడ్రైవర్ భరత్ సోనీని అదుపులోకి తీసుకుని సీన్ రీక్రియేషన్ కోసం ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ కు తీసుకెళ్లినట్లు ఉజ్జయిని SP సచిన్ శర్మ తెలిపారు.
రోడ్లపై ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
సీన్ రీక్రియేషన్ కోసం తీసుకెళ్లిన టైమ్ లో పోలీసుల కళ్లు గప్పి పారిపోవాలని నిందితుడు యత్నించగా.. రోడ్ల వెంట రన్నింగ్ చేసి మరీ జీవన్ ఖేడి ఏరియాలో ఆటోడ్రైవర్ ను పట్టుకున్నారు. నిందితుణ్ని పట్టుకునే టైమ్ లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. CC ఫుటేజీ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు.. నిందితుడు ఒక్కడేనని గుర్తించారు. పైగా ఆటోలో అమ్మాయి రక్తపు మరకల్ని గుర్తించి డ్రైవరే ఘాతుకానికి పాల్పడ్డారని తేల్చారు. ఇండోర్ లోని మహారాజా తుకాజీరావ్ హోల్కర్ గవర్నమెంట్ ఉమెన్ హాస్పిటల్ లో బాలికకు ట్రీట్మెంట్ అందిస్తుండగా.. ఇందుకోసం స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడిన టీమ్ ను ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాకు చెందిన బాలికగా ఈమెను అనుమానిస్తున్నారు. అయితే సాత్నా జిల్లా జైత్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 25న తప్పిపోయిన ఓ బాలిక కేసును పోల్చి చూస్తున్నారు.